అపర అన్నపూర్ణగా కీర్తి గడించిన డొక్కా సీతమ్మ వర్ధంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ మేరకు జనసేన పార్టీ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

డొక్కా సీతమ్మ తెలుగు బిడ్డగా పుట్టడం తెలుగువారందికీ గర్వకారణమని పవన్ కొనియాడారు. అడిగినవారికి లేదనకుండా ఆస్తులు కరిగిపోయినా డొక్కా సీతమ్మ అన్నదానం చేశారని పవన్ కొనియాడారు.

అక్కడికి పరిమితం కావడంతో పేదలకు పెళ్లిళ్లు, చదువుకోవడానికి ఆర్ధిక సహాయం తదితర ఎన్నో కార్యక్రమాలు చేశారని పవన్ ప్రశంసించారు. ఆమె మరణించి వందేళ్లు దాటినా ఇప్పటికీ ప్రజల హృదయాల్లో జీవించే ఉన్నారని తెలిపారు. డొక్కా సీతమ్మ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడం మన బాధ్యతని పవన్ తెలిపారు.

గతేడాది భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన పార్టీ ఏర్పాటు చేసిన ఆహార శిబిరాలను డొక్కా సీతమ్మ పేరిటే నిర్వహించినట్లు పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. ప్రస్తుత కరోనా సమయంలోనూ ఆ అపర అన్నపూర్ణ పేరిట జనసేన శ్రేణులు పేదలకు ఆహారం అందిస్తున్నాయని సీతమ్మ స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పారు.


కర్నూలు నగరంలో, జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుందని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్  ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడైనా జబ్బును దాచేస్తే దాగదు.... అది ముదిరిపోయి మరింత భయపెడుతుంది అన్నారు. పెరిగి పెద్దదయ్యాక ప్రజలు మరిన్ని కష్టాలుపడాల్సి వస్తుంది అని చెప్పారు. కరోనా వ్యాప్తిని నియంత్రించే క్రమంలో విధించిన లాక్ డౌన్ వల్ల రైతాంగం, పేద ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు అని తెలిపారు. 

సోమవారం సాయంత్రం కర్నూలు జిల్లా జనసేన నాయకులతో పవన్ కల్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో కరోనా కేసుల పెరుగుదల, లాక్ డౌన్ పరిణామాలపై చర్చించారు. ఈ కాన్ఫరెన్స్ లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “కరోనా వ్యాప్తి అనేది ప్రపంచంలో ఎవరూ ఊహించని ఉత్పాతం. ఈ మహమ్మారి మూలంగా తలెత్తే పరిణామాలను ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందుగానే నియంత్రణ చర్యలు చేపట్టారు. కర్నూలు ప్రాంతంలో చాలా వేగంగా కేసులు పెరుగుతున్నాయి. 

ఎప్పటికప్పుడు ఈ జిల్లాలో పరిణామాలను తెలుసుకొంటూ ఉన్నాను. బీజేపీ నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి  జిల్లాలో పరిస్థితి గురించి ఆవేదన చెందుతూ ఒక సుదీర్ఘమైన లేఖ రాశారు. ఈ మహమ్మారి విజృంభిస్తుంటే ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందీ, యంత్రాంగం వైఫల్యం గురించి అందులో ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. 

ఈ జిల్లాలోను, కర్నూలు నగరంలోను కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటం బాధాకరం.  కరోనా వ్యాప్తి విషయాన్ని మతం కోణంలో చూడటం తగదు. ఎవరికీ ఆపాదించవద్దు. ఇది మానవాళికి వచ్చిన విపత్తు. దీన్ని ఎదుర్కొనేందుకు లాక్ డౌన్ కొనసాగుతోంది. 

ఈ సమయంలో రైతాంగం ఎన్నో కష్ట నష్టాలను  ఎదుర్కొంటోంది. తమ పంటను అమ్ముకోలేకపోతున్నారు. పేద వర్గాలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నాయి. ఈ తరుణంలో రాజకీయాల కంటే ప్రజల కష్టాలు తీర్చేలా పని చేయడం ముఖ్యం.

ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అవి పరిష్కారమయ్యే విధంగా స్పందించడమే మన విధానం. కర్నూలు జిల్లా నుంచి వలస వెళ్ళిన కార్మికులు ఇబ్బందులుపడుతుంటే మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగానే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే  స్పందించారు.

ఈ క్లిష్ట సమయంలో జనసేన నాయకులు, కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం. చిన్నపాటి ఉద్యోగాలు, వృత్తుల్లో ఉన్నవారు తమ స్థాయిలో తోటి మనిషికి అండగా నిలుస్తున్నారు.

జనసేన నాయకులు, శ్రేణులకు నా విజ్ఞప్తి ఏమిటంటే... మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. నియమనిబంధనలు పాటిస్తూ, స్వీయ రక్షణ చర్యలు తీసుకొంటూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలి” అని పవన్ చెప్పారు.