అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎన్ శివప్రసాద్ మరణంపై విచారం వ్యక్తం చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. శివప్రసాద్ మరణం తనను కలచివేసిందన్నారు. 

రాష్ట్ర విభజన సమయంలోను, అనంతరం ప్రత్యేక హోదా సాధన ఉద్యమంలో శివప్రసాద్ పోరాటాలను  కొనియాడారు. ప్రత్యేక హోదా సాధన కోసం పార్లమెంట్‌లో శివప్రసాద్ చేసిన పోరాటం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు.  

స్వతహాగా నటుడు అయిన శివప్రసాద్ తనలోని కళాకారుడి ద్వారా పలురీతుల్లో నిరసనలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. శివప్రసాద్ తుది శ్వాస విడిచారని తెలిసి చాలా బాధపడ్డానని పవన్ తన ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు. 

నటుడిగా అటు చలనచిత్ర రంగంలోనూ, నాయకుడిగా ఇటు ప్రజా జీవితంలో తనదైన పంథాలో వెళ్లారని కొనియాడారు. ఎంపీగా, రాష్ట్ర సమాచార శాఖ మంత్రిగా శివ ప్రసాద్ ఎన్నో సేవలందించారని చెప్పుకొచ్చారు.

వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పవన్ తెలిపారు. తన తరఫున, జన సైనికుల తరఫున శివప్రసాద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్.