అమరావతి, పోలవరం వంటి విషయాలపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించినట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం నడ్డాతో భేటీ అయిన పవన్... జనసేన- బీజేపీ కూటమి బలోపేతంపై చర్చించినట్లు పేర్కొన్నారు.

అమరావతిలోని చివరి రైతుకు న్యాయం జరిగే వరకు తమ రెండు పార్టీలు అండగా ఉంటాయని పవన్ చెప్పారు. బీజేపీ, జనసేన కలిసి రాష్ట్రంలో అధికారంలోకి ఎలా రావాలన్న అంశంపై చర్చించామన్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, శాంతి భద్రతల సమస్య, దేవాలయాలపై దాడులపైనా చర్చకు వచ్చినట్లు పవన్ చెప్పారు. తిరుపతి ఉపఎన్నిక బరిలో అభ్యర్థిని నిలబెట్టే అంశంపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని జనసేనాని స్పష్టం చేశారు.

ప్రజలకు ఉపయోగపడేలా పనులు ఉండాలి కానీ అన్యాయం జరిగేలా ఉండకూడదని ఆయన పేర్కొన్నారు. అమరావతే రాజధానిగా ఉండాలనేదే జనసేన నిర్ణయమని పవన్ కుండబద్ధలు కొట్టారు.