హైదరాబాద్ నానక్‌రామ్ గూడలోని ఎఫ్‌వోఏ అనే ఏజెన్సీకి వాలంటీర్లు ఇచ్చే సమాచారం చేరుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. తల్లి, చెల్లి మీద గౌరవం లేని వ్యక్తికి తన భార్యపై గౌరవం వుంటుందా అంటూ జనసేనాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం వైఎస్ జగన్, వాలంటీర్లపై మరోసారి రెచ్చిపోయారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో జరిగిన వారాహి విజయ యాత్ర బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తనకు చాలా చనువు వుంటే తప్పించి ఏకవచనంతో పిలవనని అన్నారు. ఇచ్చిన గౌరవం నిలబెట్టుకోలేదు గనుకే ఏకవచనంతో పిలిచానని.. చిన్న పిల్లల కార్యక్రమంలో పెళ్లాలు అంటూ మాట్లాడే సంస్కారహీనులంటూ పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వాలంటీర్స్ తనకు సోదర సమానులని.. వారు చేస్తున్న పనికి మరో రూ.5 వేలు ఇచ్చే మనస్తత్వమన్నారు. నిజానికి వాలంటీర్ అంటే డబ్బులు ఆశించకుండా పనిచేసేవారని పవన్ కల్యాణ్ తెలిపారు. వాలంటీర్స్‌కు అధిపతి ఎవరు..? వాలంటీర్స్ ఇచ్చే సమాచారం హైదరాబాద్‌లో ఎందుకు పెట్టారని ఆయన ప్రశ్నించారు. వాలంటీర్స్ ఎర్ర చందనం తరలింపులో పట్టుబడ్డారని.. చిన్నారులపై అఘాయిత్యాలు చేస్తున్న వారికి కాళ్లు కడిగి దైవాంశ సంభూతులు అంటున్నారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాలంటీర్లు రెక్కీ నిర్వహించి అఘాయిత్యాలు చేస్తున్నారని.. లేదంటే పథకాలు ఆపేస్తున్నారని ఆరోపించారు పవన్ . వాలంటీర్స్ జీతం భూంభూమ్ బీరుకు తక్కువ.. ఆంధ్రా గోల్డ్ విస్కీకి ఎక్కువ అంటూ సెటైర్లు వేశారు. జగన్ మద్ధతుదారులు అయోగ్యుడు అనే పుస్తకం రాస్తే ముందు మాటను తాను రాస్తానంటూ పవన్ ఎద్దేవా చేశారు. రూ.1569 కోట్ల కార్మిక సంక్షేమ నిధిని జగన్ దోచేశారని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం వుండదని, వచ్చేది మన ప్రభుత్వమేనని పవన్ స్పష్టం చేశారు.
ఎఫ్‌వోఏ అనే ఏజెన్సీకి వాలంటీర్లు ఇచ్చే సమాచారం చేరుతుందని పవన్ తెలిపారు. ఏపీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా సేకరించిన ఏపీ డేటా మొత్తం హైదరాబాద్ లోని నానక్‌రాం గూడలో ఉందని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి చెందిన ప్రజల ఆధార్ డేటా మొత్తం ఓ సంస్థకు ఎందుకు అప్పగించారని ఆయన నిలదీశారు. ఆ ఏజెన్సీలో పనిచేస్తున్న దాదాపు 700 మంది ఉద్యోగులకు ఎవరు జీతాలు ఇస్తున్నారని జనసేనాని నిలదీశారు. తల్లి, చెల్లి మీద గౌరవం లేని వ్యక్తికి తన భార్యపై గౌరవం వుంటుందా అంటూ జనసేనాని సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతి గారు మీ ఆయన్ని నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పాలని.. మీకు కూడా ఆడపిల్లలు వున్నారంటూ పవన్ సూచించారు.
