సారాంశం
కొందరు వ్యక్తులకు అధికారం ఇచ్చాక వారు తీసుకున్న నిర్ణయాలకు మనం బందీలం అంటూ చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం రాజధానిని అమరావతిలో నిర్మించాలని నిర్ణయించుకుంది. అందుకు అసెంబ్లీలో బిల్లుసైతం పాస్ చేసిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం చేసింది మంచో చెడో దానికి అంతా కట్టుబడి ఉండాల్సిందేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణం అమరావతిలోనే జరగాలని సూచించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చుకుంటూ పోతే మన ఉనికికే ప్రమాదం వాటిల్లుతుందని హెచ్చరించారు.
కొందరు వ్యక్తులకు అధికారం ఇచ్చాక వారు తీసుకున్న నిర్ణయాలకు మనం బందీలం అంటూ చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం రాజధానిని అమరావతిలో నిర్మించాలని నిర్ణయించుకుంది. అందుకు అసెంబ్లీలో బిల్లుసైతం పాస్ చేసిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం చేసింది మంచో చెడో దానికి అంతా కట్టుబడి ఉండాల్సిందేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అమరావతి రాజధాని రైతులతో ప్రత్యేకంగా భేటీ అయిన పవన్ కళ్యాణ్ రాజధాని రైతులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఏడాదికి మూడు పంటలు పండే భూములను రైతులు రాజధానికి ఇచ్చి ఎంతో త్యాగం చేశారని కొనియాడారు.
రైతుల త్యాగాలను వృథాగా పోనియ్యమని మీ పోరాటాలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. రైతులకు నేటికి కౌలు చెల్లించకపోవడంతో వారు పడుతున్న ఇబ్బందులు విన్న పవన్ కళ్యాణ్ చలించిపోయారు.
ఆగష్టు 30,31 తేదీలలో తాను అమరావతిలో పర్యటిస్తానని స్పష్టం చేశారు. అసలు రాజధానిలో ఏం జరిగిందో ఇప్పటికీ తనకు ఏమీ తెలియదన్నారు. తనతోపాటు చాలామందికి తెలియదన్నారు. తాను పర్యటించి అసలు అక్కడ ఏం జరిగిందో ప్రజలకు వివరిస్తానన్నారు.
ఈ సందర్భంగా అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను నూతన ప్రభుత్వం కూడా అమలు చేయాలని కోరారు. రాజధాని నిర్మాణంలో ఏవైనా అవకతవకలు ఉంటే వాటిని సరిదిద్దాలే తప్ప మెుత్తం రాజధానినే మార్చేస్తాం అంటే రైతులకు ప్రభుత్వం, ప్రభుత్వ విధివిధానాలపై నమ్మకం పోతుందని సూచించారు.
రాష్ట్రాన్ని విడగొట్టినా, డీమానిటైజేషన్ అంటూ నిర్ణయం తీసుకున్నాఅంతా ఒప్పుకునే తీరాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. వేరే దారిలేకపోవడంతో తప్పలేదన్నారు. గత ప్రభుత్వం రాజధానిని అమరావతిలో నిర్మించాలని నిర్ణయం తీసుకుందని అందుకు అంతా సహకరించాలని సూచించారు.
ఈ సందరర్భంగా వైసీపీకి కౌంటర్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్. రాజధానిపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం అనాలోచిత నిర్ణయంగా వ్యాఖ్యానించారు. రాజధానిని తరలిస్తాం, రాజధానిపై చర్చలు జరుగుతున్నాయంటూ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు రైతులను గందరగోళానికి గురి చేస్తోందన్నారు.
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల పెట్టుబడులు రాకపోగా నిరుద్యోగం మరింత పెరిగిపోతుందని చెప్పుకొచ్చారు. ఇది రాజధాని కోసం భూములు ఇచ్చిన 28వేల రైతు కుటుంబాల సమస్య కాదని యావత్తు రాష్ట్ర ప్రజల సమస్య అని పవన్ అభిప్రాయపడ్డారు.
మంత్రులు, ప్రజాప్రతినిధులు రైతులను గందరగోళానికి గురి చేసేలా ప్రకటనలు చేయడం సరికాదన్నారు. ఒకసారి రాష్ట్రాన్ని విడగొట్టి రాజధాని లేకుండా చేశారు. మళ్లీ ఇప్పుడు రాజధానిని అమరావతి కాదు ఇంకొక చోట అంటే మన ఉనికికే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.
రాజధానిని మారిస్తే అభివృద్ధి కోసం ఇప్పటి వరకు పెట్టిన ఖర్చులు ఏమవ్వాలని నిలదీశారు. అభివృద్ధి కోసం వెచ్చించిన డబ్బు ప్రజల సొమ్ము అన్న పవన్ కళ్యాణ్ మంత్రులు మఖ్యమంత్రుల సొమ్ము కాదని హెచ్చరించారు పవన్ కళ్యాణ్.
ఈ వార్తలు కూడా చదవండి