2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనన్న ఆయన.. బీజేపీ రూట్ మ్యాప్ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే కలిసివచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామంటూ సంకేతాలిచ్చేశారు.
వైసీపీ (ysrcp) వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్ధితుల్లో చీలనివ్వమని.. బీజేపీ (bjp) రోడ్ మ్యాప్ ఇస్తామందని, దాని కోసం ఎదురుచూస్తున్నామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాలు వదిలి, రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకొచ్చే పార్టీలతో పొత్తుల గురించి ఆలోచిస్తామని పవన్ సంకేతాలిచ్చేశారు. గుంటూరు జిల్లా ఇప్పటంలో (ippatam janasena meeting) జరిగిన జనసేన ఆవిర్భావ సభలో (janasena formation day) ఆయన ప్రసంగిస్తూ.. సీఐ ర్యాంక్ పోలీసునైనా వైసీపీ నేతలు కాలర్ పట్టుకుంటారంటూ పవన్ కల్యాణ్ మండిపడ్డారు. సీఐని కొడతామని మంత్రి బెదిరిస్తాడని.. ఓ ఎంపీ కానిస్టేబుల్‌ని కొడతాడంటూ ఫైరయ్యారు.
పోలీస్ బిడ్డగా ఇదే దెబ్బ నా తండ్రికి తగిలితే.. తాను తీవ్రంగా స్పందిస్తానని పవన్ అన్నారు. పోలీసులపై వైసీపీ నేతలు జులుం చూపిప్తే.. ఉన్నతాధికారులు ఎందుకు సహిస్తున్నారని పవన్ ప్రశ్నించారు. వైసీపీ నేతలకు పోలీసులు భయపడుతున్నారని.. ఉద్యోగులకు సీపీఎస్ ఇస్తామని చెప్పి మొండిచేయి చూపారని జనసేనాని ఫైర్ అయ్యారు. వైసీపీ పార్టీ రంగుల కోసమే మూడు వేల కోట్లు ఖర్చు చేశారని పవన్ ఆరోపించారు. అలాగే అడ్వర్టైజ్‌మెంట్లకు నాలుగొందల కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు. లక్షా 19 వేల కోట్ల సంపాదన రాష్ట్రానికి వున్నప్పటికీ ఈ డబ్బు ఎటు పోతుందని ఆయన ప్రశ్నించారు.
అధ్వాన్నంగా వున్న రోడ్ల కారణంగా ఎందరో మృత్యువాతపడ్డారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. ఎయిడెడ్ స్కూల్స్‌ను ఎందుకు మూసేస్తున్నారు.. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులు, విధానాల వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చిందని పవన్ దుయ్యబట్టారు. అమర్‌రాజా కంపెనీ, కియా కంపెనీలను వెళ్లిపోయేలా చేశారని.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయన్నారు. మద్య నిషేధం అని చెప్పి.. మద్యం మీద కోట్లు సంపాదిస్తున్నారని, రెండున్నరేళ్లలో మద్యం మీద 45 వేల కోట్లు సంపాదించారని పవన్ ఆరోపించారు.
నాసిరకం లిక్కర్ అమ్ముతున్నారని.. దానివల్ల జంగారెడ్డిగూడెంలో కొందరు మృత్యువాత పడ్డారని ఆయన అన్నారు. ప్రభుత్వం వైన్ షాపులు నడుపుతోందని.. రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినవారిని ఇప్పటికీ అరెస్ట్ చేయలేదని ఆరోపించారు. ఒక మతానికి ఒక న్యాయం.. ఇంకో మతానికి ఇంకో న్యాయమేంటని పవన్ ప్రశ్నించారు. దేవాదాయ శాఖ యాక్ట్‌ను సవరించాల్సి వస్తే.. తప్పకుండా దీనిపై పెద్దలతో చర్చిస్తామన్నారు. సంపన్న ఆంధ్రప్రదేశే తన లక్ష్యమని.. బలమైన పాలక విధానాన్ని తీసుకువస్తామని పవన్ చెప్పారు.
అమరావతిని అభ్యుదయ రాజధానిగా తీర్చిదిద్దుతామని.. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెడతామని జనసేనాని పేర్కొన్నారు. తెల్లకార్డుదారులకు ఇసుక ఉచితంగా అందిస్తామని.. పాతిక కేజీల బియ్యం కాదు, పాతికేళ్ల భవిష్యత్తును యువతకు అందిస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. యువతకు వ్యాపారాభివృద్ధి కోసం పది లక్షలు అందిస్తామని.. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే తన లక్ష్యమన్నారు. సీపీఎస్‌ను రద్దు చేస్తామని.. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
వైవీ సుబ్బారెడ్డి (yv subba reddy) కులంపై చేసిన వ్యాఖ్యలకు అభినందనలు తెలిపారు. కులాల ఐక్యత కోసం తాను సోషల్ ఇంజనీరింగ్ చేశానని.. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి (dwarampudi chandrasekhar reddy) తనను అకారణంగా పచ్చి బూతులు తిట్టినా, తాను భరించానని పవన్ గుర్తుచేశారు. జనసైనికులు నిరసనకు వెళ్తే వైసీపీ దాడులు చేసిందని.. బూతులు తిట్టే ద్వారంపూడి వంటి నేతలకు వైవీ సుబ్బారెడ్డి గడ్డి పెట్టాలని హితవు పలికారు. భవిష్యత్తులో ఇలాంటివి జరిగితే.. భీమ్లా నాయక్ ట్రీట్‌మెంట్ ఏంటో చూపిస్తానని పవన్ హెచ్చరించారు.
