మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖపట్నంలో త్వరలోనే పర్యటిస్తానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం విశాఖపట్నం జిల్లా ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు.

మున్సిపల్ ఎన్నికలు, ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతంపై చర్చించారు. మార్చి 8వ లోపు తన పర్యటన విశాఖలో ఉండవచ్చని సూచన ప్రాయంగా తెలిపారు. అది ఏ రోజు అనేది ఒకటి రెండు రోజుల్లో తెలియజేస్తానని పవన్ స్పష్టం చేశారు.

పార్టీ బలోపేతంలో భాగంగా మొన్న పార్టీ ప్రధాన కార్యదర్శి టి. శివశంకర్‌తో సమావేశమైన పవన్ కళ్యాణ్.. ఆదివారం అనకాపల్లి పరుచూరి భాస్కర్, భీమిలి ఇంఛార్జి సందీప్ పంచకర్ల, యలమంచిలి ఇంఛార్జీ సుందరపు విజయ్ కుమార్, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇంచార్జీ పసుపులేటి ఉషాకిరణ్‌లతో భేటీ అయ్యారు.

విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేస్తే బాగుంటుందని నేతలు పవన్ దృష్టికి తీసుకురావడంతో అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు.

మున్సిపల్ , నగర పంచాయతీ ఎన్నికల తర్వాత  ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై మరింత విశ్లేషాణాత్మకంగా చర్చిద్దామని జనసేనాని వెల్లడించారు. ప్రస్తుత ఎన్నికలు, ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీ పరంగా ఎటువంటి చర్యలు చేపట్టాలో నేతలకు పవన్ తెలిపారు.