ముమ్మడివరం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. సొంతపార్టీ ఎమ్మెల్యే ఆకురౌడీలా, వీధి రౌడీలా వ్యవహరిస్తుంటే అదుపు చేయలేని చంద్రబాబు నాయుడు ఓ ముఖ్యమంత్రా అని పవన్ ప్రశ్నించారు. 

ఆడపడుచులను జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లి కొడుతుంటే సస్పెండ్‌ చేయలేని వ్యక్తి ఏం సీఎం అని చంద్రబాబుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులపై ఇష్టం వచ్చినట్లు తిడుతుంటే ఖండించలేని నువ్వా సీఎం అంటూ మండిపడ్డారు.

దళితులను కులాల పేరు పెట్టి తిడుతుంటే, మీడియా ప్రతినిధులను అమ్మనా బూతులు తిడుతుంటే కనీసం యాక్షన్ తీసుకోలేని సీఎం మనకెందుకు అన్నారు. ఇలాంటి సీఎం మనకు వద్దు అని రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు సెలవిద్దామన్నారు.  

యువత త్యాగాలు చేయాలని సీఎం చంద్రబాబు చెప్తున్నారని మరి చంద్రబాబు ఏం చేస్తారని ప్రశ్నించారు. యువత, తాము త్యాగాలు చేస్తే లోకేష్ మాత్రం సైకిల్ పై రాజధాని రోడ్లపై తిరుగుతాడా? అని నిలదీశారు. మాట్లాడితే చంద్రబాబు సింగపూర్‌ తరహా అభివృద్ధి అంటారని, మరి ఆ అభివృద్ధి ఎక్కడ కనపడుతుందో చెప్పాలన్నారు.

చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి పెచ్చుమీరిపోయిందని ఈ పార్టీని గద్దె దించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలంతా ఆదరిస్తే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని మనమే మన రాష్ట్రాన్ని పాలించుకుందామని తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

పరిశ్రమలు స్థాపించరు కానీ కోట్లు దోచేస్తారు: సుజనాచౌదరిపై పవన్

చంద్రన్నకు సెలవిద్దాం, జగన్ ను పక్కన పెడదాం:పవన్ కళ్యాణ్