ముమ్మడివరం: టీడీపీ రాజ్యసభ సభ్యుడు,మాజీ కేంద్రమంత్రి సుజనాచౌదరిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. సుజనా చౌదరి బ్యాంకుల దోపిడీ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందని అన్నారు. 

ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో పర్యటిస్తున్న పవన్ సుజనా చౌదరి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వేలకోట్లు దోచేశారని మండిపడ్డారు. కార్లు సీజ్‌ అయ్యాయని వార్తా పేపర్లలో చదివి షాక్‌ గురయ్యానని తెలిపారు. సుజనా చౌదరి తనకు ఎంపీగానే తెలుసునని ఇంత అవినీతిపరుడని తెలియదన్నారు. 

సుజనాచౌదరి కంపెనీలు పెట్టారా, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు అని నిలదీశారు. ఏదైనా ప్రొడక్ట్స్ ను తయారు చేశారా అని నిలదీశారు. మరి ఒక ఎంపీగా ఉండి ఇలా వేలకోట్లు ఎలా సంపపాదించేస్తారని ప్రశ్నించారు. 

 డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయరు కానీ పారిశ్రామిక వేత్తలు, రాజ్యసభ సభ్యులు మాత్రం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని బకాయిలు చెల్లించరని మండిపడ్డారు. అయినా బ్యాంకులు వారిని ఏమి చేయలేవన్నారు. 

డ్వాక్రా మహిళలు వాళ్ల డబ్బును బ్యాంకుల్లో దాచుకుంటారు కానీ వాళ్లకు మాత్రం నిధులు ఇవ్వరు లోన్ లు కూడా ఇవ్వరని కానీ ఎగ్గొట్టే రాజకీయవేత్తలకు ఇస్తారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.