విజయదశమి నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో జనసైనికులు సిద్ధంగా వుండాలంటూ ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు (ap assembly elections) ముందే వస్తాయన్న అంచనాతో బస్సు యాత్రకు రెడీ అయ్యారు జనసేన అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan bus yatra) . విజయదశమి సందర్భంగా అక్టోబర్ 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు. 2023 మార్చిలోనే ఎన్నికలు రాబోతున్నాయని వ్యాఖ్యానించారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (nadendla manohar) . ఆ ఎన్నికలకు అందరూ సిద్ధంగా వుండాలంటూ పిలుపునిచ్చారు. తిరుపతి నుంచి పవన్ బస్సు యాత్రను ప్రారంభిస్తారని మనోహర్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 కాదు కదా.. 30 సీట్లు రావని ఆయన జోస్యం చెప్పారు. 6 నెలల్లో రాష్ట్రమంతా పవన్ పర్యటిస్తారని... ప్రతి ఉమ్మడి జిల్లాలో బహిరంగ సభ వుంటుందని నాదెండ్ల తెలిపారు.
శుక్రవారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో చేనేత వికాస విభాగం ఛైర్మన్, మంగళగిరి నియోజకవర్గ ఇంఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాస్ ఆధ్యక్షతన జరిగిన క్రియాశీలక సభ్యుల బీమా పత్రాలు, కిట్ల పంపిణీ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అత్యధిక సభ్యత్వాలు చేసిన వాలంటీర్లకు ఆయన స్వయంగా మెమెంటోలు ఇచ్చి సత్కరించారు.
అనంతరం నాదెండ్ల మాట్లాడుతూ.. "ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రతి క్రియాశీలక సభ్యుడు సిద్ధంగా ఉండాలి. పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. రాష్ట్ర ప్రజలంతా జగన్ రెడ్డికి ఇంకోసారి ఓటు వేయకూడదని ఎప్పుడో నిర్ణయించుకున్నారు. జులై మాసానికల్లా గ్రామ కమిటీలు, పట్టణ, వార్డు స్థాయి కమిటీలు ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. రాబోయే రోజుల్లో పార్టీ తరఫున మరిన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నాం’’.
‘‘ కష్టకాలంలో, ఎవరూ నమ్మని సమయంలో మీరంతా పార్టీకి అండగా నిలబడ్డారు. పార్టీ నిర్మాణ సమయంలోనూ పవన్ కళ్యాణ్ మాటకు గౌరవం ఇచ్చి, ఆయన ఇచ్చిన ప్రతి పిలుపుకీ స్పందించారు. జనసేన పార్టీవి స్వార్ధంతో కూడిన రాజకీయాలు కావు. జనసేన పార్టీ అవకాశవాద రాజకీయాలు చేయదు. ఏ కార్యక్రమం చేసినా అది ఎన్నికల సమయంలో ఓట్లు సాధించేందుకు ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచించలేదు. అటువంటి రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు. జనసేన పార్టీకి నిజాయితీగా ఒక సమస్య పరిష్కారం కోసం పని చేయాలన్న ఆలోచన మినహా మరే ఆలోచన ఉండదన్నారు’’.
‘‘ కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం మొదలుపెట్టాం. జనసైనికులు అద్భుతంగా స్పందించారు. ఓ వైపు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూనే పవన్ కళ్యాణ్ ఆదేశాలను ముందుకు తీసుకువెళ్లారు. జనసేన పార్టీ గొప్పతనం జనసైనికులే. వారు కోరేది ఒక బలమైన మార్పు. రాజకీయ వ్యవస్థ దుర్మార్గంగా కొంత మంది పెద్ద వ్యక్తుల కోసమే పని చేస్తుంది. అలాంటి వ్యవస్థల్ని మార్చాలన్న లక్ష్యంతో ప్రతి జనసైనికుడు పని చేస్తున్నారు.’’
‘‘ క్రియాశీలక సభ్యులంతా గ్రామాల్లో తిరగండి. ప్రజలతో మాట్లాడండి. గతంలో ఏ పార్టీ నాయకుడు తన సొంత డబ్బు వెచ్చించి ప్రజల్ని ఆదుకున్న దాఖలాలు లేవు. అంత మెజారిటీ కట్టబెట్టిన ముఖ్యమంత్రి సొంత జిల్లాలో 132 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ఆదుకున్న దాఖలాలు లేవు. సొంత నియోజకవర్గం పులివెందులలో 13 మంది ఆత్మహత్యకు పాల్పడితే పట్టించుకోలేదు.’’
రాష్ట్ర ప్రజలు 151 స్థానాలతో భారీ మెజారిటీ కట్టబెడితే ఆయన తాడేపల్లి ప్యాలెస్ కి పరిమితమై ప్రజలు కష్టాలు పడుతుంటే చోద్యం చూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఆపదలో ఉన్న కౌలు రైతుల కుటుంబాలకు ఒక భరోసా కల్పించేందుకు ఓ మంచి కార్యక్రమం చేపడదామని నిర్ణయించారు. మొదట్లో చనిపోయిన రైతుల సంఖ్య 500 ఉంటుందని అనుకున్నాం. రైట్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా సమాచారం సేకరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల మందికి పైగా కౌలు రైతులు ఆత్మహ్యత్య చేసుకున్నారని తెలిసిందన్నారు.’’
‘‘ మొదట మా పరిపాలన చాలా గొప్పగా ఉంది. మా పాలనలో ఆ పరిస్థితే లేదన్న వారు పవన్ కళ్యాణ్ జిల్లాల్లో పర్యటిస్తుంటే రాత్రికి రాత్రి బాధితుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నారు. ప్రభుత్వం మిమల్ని ఆదుకుంటుందని మభ్యపెట్టి వారిని పవన్ కళ్యాణ్ సభలకు రాకుండా ఆపడానికి ప్రయత్నించారు. ఫ్యాక్షన్ రాజకీయాలు రాజ్యమేలే నంద్యాల లాంటి ప్రాంతంలో రైతులు, మహిళలు అలాంటి పరిస్థితులను ఎదిరించి రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యారు.’’
‘‘ రాష్ట్రంలో చూస్తే ఒక్క అభివృద్ధి కార్యక్రమమూ లేదు. ఒక్క రోడ్డు వేసింది లేదు. కనీసం గ్రామాల్లో ఒక్క తట్ట మట్టితో గుంతలు పూడ్చింది లేదు. అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రోడ్లకు మరమ్మతులు చేపట్టే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అండగా నిలబడుతున్నాం. ఉదయం తెనాలిలో ప్రమాదవశాత్తు మరణించిన సుబ్రహ్మణ్యం అనే కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించినప్పుడు అతను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడం వల్ల చనిపోయినట్టు తెలిసింది. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి గానీ, కనీసం ఆర్టీసీ యాజమాన్యం నుంచి గాని ఆ కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు లేవు. కనీసం పరిహారం అందించలేదు.
ప్రతి ప్రజా సమస్యలో అండగా నిలబడే వ్యక్తి పవన్ కళ్యాణ్ . రాబోయే రోజుల్లో పార్టీ తరఫున ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నాం’’.
‘‘ ప్రజా జీవితంలో అంతిమ తీర్పు ప్రజలదే. పోలీసులను వెంటబెట్టుకుని గడప గడపకు తిరిగితే ప్రజా సమస్యలు ఏం తెలుస్తాయి. నిజాయితీగా ప్రజల ఇళ్లకు వెళ్తే ఈ ప్రభుత్వంతో వారు పడుతున్న ఇబ్బందులేంటో చెబుతారు. 151 సీట్లు చాలలేదు 175 సీట్లు రావాలని కలలు కంటున్నారు. జగన్ రెడ్డికి ఈసారి 30 సీట్లు వస్తే గొప్ప.’’
‘‘ మనం నినాదాలకే పరిమితం అయితే సరిపోదు. మన మిత్రులు, సన్నిహితులను పార్టీలోకి ఆహ్వానించాలి. ప్రతి ఒక్కరికీ అండగా నిలబడేలా ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం అవసరం. అందుకోసం ప్రతి ఒక్కరు శక్తివంచన లేకుండా కృషి చేయాలి. బయటికి వస్తే ప్రభుత్వంలో ఉన్న వారు కేసులు పెట్టి వేధిస్తున్నారు. అభద్రతా భావంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. మీ కోసం పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక అడ్వకేట్ అందుబాటులో ఉండే విధంగా న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేశారు. మిమ్మల్ని ఏ మాత్రం ఇబ్బంది పెట్టినా పార్టీ నాయకులకు సమాచారం ఇవ్వండి. దొంగ కేసులు పెట్టే వారిని ఎదుర్కొనేందుకు పార్టీ సిద్ధంగా ఉంది. అవసరం అయితే కోర్టుకి వెళ్లి మీ కోసం నిలబడుతుంది.’’
‘‘ పార్టీ అధ్యక్షుల వారి మీద చేసే దుష్ప్రచారాలు నమ్మవద్దు. గతంలోనూ ఇలాంటి ప్రచారాలు చేశారు. ఇప్పుడు అమలాపురంలో పార్టీ మీద అలాంటి కుట్రలు మొదలు పెట్టారు. అక్కడ జరిగింది ప్రభుత్వ కుట్ర. కేవలం ఓట్ల కోసం సమాజంలో వర్గాలను చీల్చే కుట్ర పన్నారు. ఒక రాష్ట్ర మంత్రి ఇంటి మీద దాడి చేసే పరిస్థితి ఉంటే తప్పుకుండా పోలీసులకు ముందే సమాచారం ఉంటుంది. కాకినాడలో అధికార పార్టీ ఎమ్మెల్యే అధ్యక్షుల వారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడంతోపాటు పార్టీ శ్రేణుల మీద దాడులకు పాల్పడినప్పుడు వారిని పరామర్శించేందుకు జిల్లాకు వెళ్తుంటే మొత్తం 144 సెక్షన్ విధించారు. విశాఖ ఎయిర్ పోర్టులోనే పవన్ కళ్యాణ్ ఆపుతారేమో అన్న భావన కలిగించారు. అలాంటిది మంత్రి, ఎమ్మెల్యే మీద దాడి జరిగితే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి నుంచి స్పందన లేదు. ముఖ్యమంత్రి మనసులో ఎలాంటి దురాశ ఉందో ప్రజలు అర్ధం చేసుకోవాలి. జనసేన శ్రేణులు కేవలం ప్రజా సమస్యల మీద మాత్రమే స్పందించండి. వ్యక్తిగతాలకు పోవద్దు" అని నాదెండ్ల మనోహర్ హితవు పలికారు.
