సీఎం జగన్మోహన్ రెడ్డిపై మరోసారి మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రాజధాని తరలింపును నిరసిస్తూ సోమవారం అమరావతిలో రైతులు నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు.

అనంతరం జనసేనాని మాట్లాడుతూ.. ప్రభుత్వం పార్టీ వ్యవహారంలా ఉండకూడదన్నారు. గతంలో వైఎస్ జగన్ కూడా అమరావతి రాజధానిగా ఒప్పుకున్నారని పవన్ గుర్తుచేశారు. ప్రతిపక్షం కూడా ఒప్పుకుంది కనుకే రైతులు భూమిలిచ్చారని జనసేనాని వెల్లడించారు.

రైతులు కన్నీరు పెడితే పోరాటం చేస్తామని తాను అప్పుడే స్పష్టంగా చెప్పానన్నారు. అంచెలంచెలుగా రాజధాని నిర్మాణాన్ని చేపట్టవచ్చని పవన్ సూచించారు. గత ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి ఎంతో కొంత విలువ ఇచ్చిందని.. రాజధాని అమరావతిలో వద్దని అప్పుడు జగన్ చెప్పలేదని పవన్ గుర్తుశారు.

ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మార్చుతామంటే ఎలా..? అని ఆయన ప్రశ్నించారు. మరోవైపు రేపటి పవన్ కల్యాణ్ రాజధాని పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకన్నాయి.

సీఎం జగన్మోహన్ రెడ్డి మంగళవారం సచివాలయానికి వెళ్తుండటంతో భద్రతా కారణాల రీత్యా జనసేన పార్టీ పవన్ పర్యటలో మార్పులు చేసింది. యర్రబాలెం ధర్నాలో పాల్గొని ఆయన నేరుగా తుళ్లూరు వెళ్లనున్నారు. అలాగే వెలగపూడి, మందడం గ్రామాల్లో జరిగే కార్యక్రమాల్లో సైతం పవన్ పాల్గొంటారు.