విజయవాడ: ప్రత్యేక హోదా సాధన విషయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వివాదాస్పదమవుతున్నాయి. ప్రత్యేక హోదా సాధించాలన్న కసి ఏపీ నేతల్లో కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన అనుకున్నది సాధించుకోవడంలో తెలంగాణ ప్రజలకున్న పట్టుదల ఆకాంక్ష ఆంధ్రరాష్ట్ర ప్రజలకు గానీ నేతలకుగానీ లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు దశాబ్దాలపాటు పోరాడారని చివరకు సాధించుకున్నారని గుర్తు చేశారు. 

అయితే ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంతటి ఆకాంక్షను చూపలేకపోయారని పవన్ ఆరోపించారు. ప్రత్యేక హోదాపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పదిసార్లు మాటలు మార్చినా ప్రజల నుండి సరైన నిరసన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రజల నుండి బలమైన నిరసన రానంతవరకు హోదా విషయంలో తామేమీ చేయలేమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. హోదా సాధన విషయంలో ఆంధ్ర ప్రజలకు బలమైన ఆకాంక్ష ఉంటే తప్ప ఎవరూ ఏమీ సాధించలేరన్నారు. 

ప్రజల్లో ప్రత్యేక హోదాపై చైతన్యం రావాలని, వారి నుంచి ఒక ఉద్యమం వస్తే గానీ హోదా వచ్చేలా కనబడటం లేదన్నారు పవన్ కళ్యాణ్. హోదా విషయంలో జనసేన పార్టీ మెుదటి నుంచి ఒకే మాట ఒకేబాటగా వ్యవహరించిందని తెలిపారు. ప్రజలు కలిసి వస్తే మరోసారి ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.