అమరావతి: ఒక భావజాలంతో రాజకీయాల్లోకి వచ్చానని బలమైన సిద్ధాంతాలతో ప్రజలకు సేవ చేద్దామని పార్టీ పెట్టానని చెప్పుకొచ్చారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమన్న పవన్ కళ్యాణ్ 2024 టార్గెట్ గా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని చెప్పుకొచ్చారు. 

ఈ నేపథ్యంలో పార్ట్ టైం పొలిటీషియన్ అంటూ ఇతర పార్టీలు చేస్తున్న ఆరోపణలపై స్పందించిన పవన్ కళ్యాణ్ తాను పార్ట్ టైం పొలిటీషయన్ కాదని చెప్పుకొచ్చారు. ప్రజల కోసమే తాను పార్టీ పెట్టానని స్పష్టం చేశారు. ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే పరిస్థితి ఏంటి అనే అంశంపై కూడా ఆలోచించే ఆనాడు నిర్ణయం తీసుకుని 2014లో పార్టీ పెట్టినట్లు తెలిపారు. 

2014లో అటు బీజేపీకి, ఇటు టీడీపీకి మద్దతు ఇచ్చి అధికారంలోకి వచ్చినట్లు గుర్తు చేశారు. 2014 ఎన్నికల్లో పోటీ చేశామని అయితే ఓటమి పాలయ్యామని తెలిపారు. ఒకసారి ఓటమి పాలయ్యామని తాను పార్టీ మూసెయ్యలేదని, సైలెంట్ గా ఉండిపోలేదన్నారు. 

పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు వ్యూహారచన చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ పరిస్థితిపై జిల్లాల వారీగా రివ్యూలు నిర్వహించి దిద్దుబాట్లు చేసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర కమిటీలను కూడా నియమిస్తున్నామని తెలిపారు. 

పార్ట్ టైం పొలిటీషయన్ ఇలా చేస్తారా అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఎవరు ఏమన్నా తానుమాత్రం బలమైన భావజాలంతో రాజకీయాల్లోకి వచ్చానని అలాగే ముందుకు వెళ్తానని పార్టీని మూసేసే పరిస్థితి అస్సలే ఉండదన్నారు. పార్టీ ఉంటుంది తాను అందుబాటులో ఉంటానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.