ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సవాల్ విసిరారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈసారి తాను ఎట్టిపరిస్థితుల్లోనూ అసెంబ్లీలో అడుగుపెడతానని.. ఎవరు అడ్డొస్తారో చూస్తానని ఆయన హెచ్చరించారు. విడిగా రావాలో, ఉమ్మడిగా వస్తానో త్వరలోనే చెబుతానని పవన్ అన్నారు.
ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఎవడు ఆపుతాడో చూస్తానని పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో జనసేన వారాహి యాత్రను పవన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. పవన్ కల్యాణ్ అనేవాడు అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేయాలని తనపై కక్షగట్టారని ఆరోపించారు. ప్రజల్ని బాగా చూసుకుంటానంటే వైసీపీతో తనకు ఇబ్బంది లేదన్నారు. ఒక్క సీటు కూడా లేని జనసేనను వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడితే క్లాష్‌వార్ అంటాడని.. ఎప్పుడూ నవ్వుతూ వుంటాడని సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. పార్టీని నడపటానికే తాను సినిమాలు చేస్తున్నానని పవన్ తెలిపారు.
తన సినిమాలు ఆపేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నారని.. మరి క్లాష్‌వార్ ఎవరు చేస్తున్నారని ప్రశ్నించారు. సినిమా టికెట్‌లపైనా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని పవన్ మండిపడ్డారు. జనసేన కేంద్ర కార్యాలయం మంగళగిరి నుంచే పనిచేస్తుందని.. ఇకపై రాజకీయాలన్ని ఏపీ నుంచే చేస్తానని స్పష్టం చేశారు. విడిగా రావాలో, ఉమ్మడిగా వస్తానో త్వరలోనే చెబుతానని పవన్ అన్నారు. సీఎం పదవి జనసేనకు రావాలంటే ఏం చేయాలో తనకు బాగా తెలుసునని అన్నారు. ఈసారి తాను అసెంబ్లీలో అడుగుపెడతానని పవన్ పేర్కొన్నారు. తనకు అక్రమంగా వచ్చే డబ్బులు ఏం లేవని ఆయన స్పష్టం చేశారు.
పొట్టి శ్రీరాములుకు ప్రభుత్వాలు తగిన గౌరవం ఇవ్వడం లేదన్నారు. తనకు రాజకీయాలపై స్పూర్తిని కలిగించిన వారిలో చేగువేరా ఒకరని పవన్ తెలిపారు. అక్రమంగా డబ్బులు సంపాదించి, వేల కోట్లున్న వారితో తాను పోరాటం చేస్తున్నాని జనసేనాని వ్యాఖ్యానించారు. తనను పాలించేవాడు.. తనకంటే నిజాయితీపరుడై వుండాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఒక ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడితే .. ప్రశ్నించగలిగింది ప్రజలేనని ఆయన స్పష్టం చేశారు. పాలించేవారికి తాము గులాంగిరీకాదని పవన్ తెలిపారు. మీ కోసం, మీ భవిష్యత్తు కోసం రాజకీయాల్లోకి వచ్చానని జనసేనాని చెప్పారు. పదేళ్లు పార్టీని నడిపించడం అంత తేలిక కాదన్నారు
