మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్దంతి సందర్బంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయనను స్మరించుకున్నారు. వీరులకు పుట్టుకేగాని మరణం ఉండదని.. అల్లూరి చైతన్యం,  రగిల్చిన విప్లవాగ్ని నిత్యం జ్వలిస్తూనే ఉంటుందన్నారు. 

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్దంతి సందర్బంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయనను స్మరించుకున్నారు. వీరులకు పుట్టుకేగాని మరణం ఉండదని.. అల్లూరి చైతన్యం, రగిల్చిన విప్లవాగ్ని నిత్యం జ్వలిస్తూనే ఉంటుందన్నారు. మహాయోధుడు అల్లూరి వీర మరణం పొంది నేటికీ వందేళ్లు పూర్తయ్యాయని గుర్తుచేశారు. ఆ విప్లవ జ్యోతికి భక్తిపూర్వకంగా ప్రణామాలు అర్పిస్తున్నానని చెప్పారు. కారణజన్ములు తాము చేయవలసిన కార్యాన్ని పూర్తి చేసి అదృశ్యమైపోతారని అన్నారు. 

దాస్యశృంఖలాలతో అణగారిపోతున్న ప్రజలలో చైతన్యం రగల్చడానికి వచ్చిన అల్లూరి.. ఆ కార్యం నెరవేర్చి మహాభినిష్క్రమణం గావించారని అన్నారు. అల్లూరి సీతారామరాజు మన్యం ప్రజలలో రగిల్చిన విప్లవాగ్ని గురించి తెలుగు నేలపై అందరికి విదితమేనని పేర్కొన్నారు. 

నేటితరానికి అల్లూరి సీతారామరాజు సంకల్పం, పోరాట పటిమ, ధీరత్వం, మృత్యువుకు వెరవని ధైర్యం, జ్ఞాన-ఆధ్యాత్మిక సంపద గురించి తెలియజేయాలన్నారు. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలని కోరారు. అల్లూరికి భారతరత్న ప్రకటించి ఆ పురస్కారానికి మరింత వన్నె అద్దాలని పవన్ కోరారు. ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అల్లూరి స్ఫూర్తిని దేశమంతా చాటాలని అన్నారు. జనసేన అధికారంలో వస్తే ఆ బాధ్యతను తామే స్వీకరిస్తామని చెప్పారు.