Asianet News TeluguAsianet News Telugu

ఏలూరు ఘటన కచ్చితంగా క్రిమినల్ నెగ్లిజన్సే.. పవన్ కల్యాణ్ ఫైర్..

ఏలూరు అస్వస్థతపై సర్కారు ఉదాసీనత వ్యవహరిస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ మేరకు ఒక ప్రసెనోట్ ను విడుదల చేశారు. అంతుచిక్కని వ్యాధితో ఏలూరులో ఇప్పటి వరకు 600  మందికిపైగా ఆస్పత్రి పాలవగా సుమారు 470 మంది డిశ్చార్జు అయినట్లు ప్రభుత్వ ఆస్పత్రి వర్గాలు, అధికారులు చెబుతున్నాయి. ప్రజలు ఆందోళనతోనే కాలం గడుపుతున్నారు. 

Janasena cheif pawan kalyan press note on eluru mystery illness - bsb
Author
Hyderabad, First Published Dec 9, 2020, 3:03 PM IST

ఏలూరు అస్వస్థతపై సర్కారు ఉదాసీనత వ్యవహరిస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ మేరకు ఒక ప్రసెనోట్ ను విడుదల చేశారు. అంతుచిక్కని వ్యాధితో ఏలూరులో ఇప్పటి వరకు 600  మందికిపైగా ఆస్పత్రి పాలవగా సుమారు 470 మంది డిశ్చార్జు అయినట్లు ప్రభుత్వ ఆస్పత్రి వర్గాలు, అధికారులు చెబుతున్నాయి. ప్రజలు ఆందోళనతోనే కాలం గడుపుతున్నారు. 

ఈ నేపథ్యంలో జనసేనకు చెందిన డాక్టర్లు బృందం ఏలూరులో పర్యటించింది. ‘డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ నేతృత్వంలో డాక్టర్ బొడ్డేపల్లి రఘు, డాక్టర్ ఎమ్.వెంకటరమణ  నేను చెప్పిన వెంటనే మంగళవారం నాడు ఏలూరు వెళ్లి అక్కడ వివిధ ప్రాంతాలలో పర్యటించి నాకు నివేదికను అందజేశారు. వారు పేర్కొన్న వివరాలను పరిశీలిస్తే చిన్న చిన్న వసతులను సైతం ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా ఉంటోందో అర్ధంకావడం లేదు.

ముఖ్యంగా చిన్న పిల్లలకు ఐ.సి.యు లేకపోవడం, ఈ అంతుచిక్కని వ్యాధి రోగులకు ప్రత్యేక ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయకుండా సాధారణ రోగుల వార్డుల్లోనే చికిత్సలు అందించడం, ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ఉన్న 500 పడకల ఆస్పత్రిలో న్యూరోఫిజీషియన్ లేకపోవడం వంటి విషయాలు చాలా బాధ కలిగిస్తున్నాయి. 

ఏలూరు వింత వ్యాధి : జగన్ ప్రభుత్వ ఘోర వైఫల్యం వల్లే.. రామానాయుడు

బాధితులు ఫిట్స్ వస్తుంటే న్యూరోఫిజీషియన్ లేకపోతే కనీసం పక్కనున్న విజయవాడ నుంచి అయినా న్యూరోఫిజిషియన్లను ఏర్పాటు చేయవచ్చు కదా? ఈ వ్యాధికి కలుషిత నీరు కూడా ఒక కారణంగా భావిస్తున్న తరుణంలో బాధిత ప్రాంతాలలో ట్యాంకర్ల ద్వారా మంచినీరును ఎందుకు సరఫరా చేయడం లేదు? ఇటువంటి ప్రశ్నలకు శ్రీ జగన్ రెడ్డి గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పరిస్థితులను చక్కదిద్దాలి. ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిన తరువాత కూడా ఇక్కడ ఎటువంటి అదనపు సదుపాయాలు ఏర్పాటు కాకపోవడం గమనించ తగ్గ విషయం. ఏలూరులో సాధారణ పరిస్థితులు నెలకొనే విధంగా తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా ఏర్పాట్లు చేయాలి’ అని పేర్కొన్నారు. 

అంతేకాదు డాక్టర్ల నివేదిక, అనుమానాలు, ప్రభుత్వానికి సలహాలు కూడా ఈ ప్రెస్ నోట్ లో పొందుపరిచారు.

డాక్టర్ల బృందం నివేదికలో ముఖ్యాంశాలు:

వ్యాధి బారిన పడిన బాధితుల్లో ఒక్కసారి మాత్రమే మూర్ఛ వస్తుంది. రిపీట్ కావడం లేదు. కొంతమందిలో మతిమరపు, వాంతులు, విరోచనాలు కనిపిస్తున్నాయి. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కూడా 80 శాతం మందిలో నీరసం, తలనొప్పి, వెన్నునొప్పి వంటి  లక్షణాలు ఉన్నాయి.

ప్రత్యేకించి ఫలానా వయసువారికి మాత్రమే అస్వస్థత వస్తుందనేది లేదు. అన్ని వయసుల వారు అస్వస్థతకు గురవుతున్నారు. వ్యాధి తీవ్రత తక్కువగానే ఉంది. వ్యాధి బారిన పడినవారు ఒకటి, రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతున్నారు. అయితే సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి ఇది వ్యాపించడం లేదు.

ఏలూరు మున్సిపల్ వాటర్ పంపిణీ లేని ప్రాంతాలైన దెందులూరు, నారాయణపురం, కొవ్వలి, కృష్ణా జిల్లాలోని నూజివీడు, కైకలూరులో కూడా ఫిట్స్ కేసులు నమోదవ్వడం ఆందోళనకు గురిచేస్తోంది.

వ్యాధిబారిన పడ్డ వారిలో సీటీ స్కాన్, రక్త నమూనాలు పరీక్షించగా అవి సాధారణంగానే ఉన్నాయి. తాగునీటి శాంపిళ్లు పరీక్షించగా అందులో పరిమితికి మించి లెడ్, నికెల్ వంటి లోహాలు లేవని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అలాగే వెన్నెముక నుంచి తీసిన నమూనాల ద్వారా చేసిన కల్చర్‌ పరీక్షల్లో వైరస్‌, బ్యాక్టీరియా ఆనవాళ్లు బయటపడలేదు.

అనుమానాలు :
వాయు కాలుష్యం వల్ల వ్యాధి విస్తరించలేదు. నీటి కాలుష్యం లేదా ఆహార కాలుష్యం వల్ల వ్యాధి ప్రబలి ఉండాలి. గాలి కాలుష్యం వల్ల వ్యాధి ప్రబలితే ఇప్పటికే చాలా ఎక్కువ మందిలో వ్యాధి లక్షణాలు కనిపించి ఉండాలి.    

ఏలూరులో ఆక్వాకల్చర్ ఎక్కువ. వాటి వ్యర్ధాలు ఏమైనా తాగునీటిలో కలవడం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. బాధిత ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా చేపలను ఆహారంగా తీసుకుంటారు. ఫిష్ పాండ్స్ లో వాడిన కెమికల్స్ వల్ల కూడా అస్వస్థతకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి.

కూరగాయలపై చల్లిన రసాయనాల వల్ల కూడా వ్యాధి రావొచ్చు కనుక వెంటనే కూరగాయల నమూనాలను నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కు పంపించి పరీక్షించాలి. అలాగే రసాయన విశ్లేషణ కోసం ఐఐసీటీకి నమూనాలు పంపించాలి. 
 
ఏలూరులో నీటి కాలుష్యం చాలా ఏళ్లుగా ఉంది. మంచినీటి పైపులైన్లల్లో డ్రైనేజీ వాటర్ కలిసిపోతుంటాయి. అలా జరగడం వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అలాగే   మున్సిపల్ వాటర్ ను సరిగా క్లోరినేషన్ చేయకపోవడం, క్వాలిటీ బ్లీచింగ్ పౌడర్ వాడకపోవడం కూడా ఒక కారణం కావచ్చు.

ప్రభుత్వానికి సలహాలు, సూచనలు :

న్యూరోఫిజీషియన్ ఉండాల్సిన స్థానంలో న్యూరోసర్జన్ ను పెట్టారు. హెల్త్ మినిస్టర్ ఇలాకా అయిన ఏలూరు ఆస్పత్రిలో పిల్లలకు ఐసీయూ లేదు. వ్యాధికి గురవుతున్న వారిలో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు. ఐసీయూ లేకపోవడంతో జనరల్ వార్డుల్లోనే ట్రీట్మెంట్ చేస్తున్నారు. పెద్దవారికి ఐసీయూ ఉన్నా బెడ్లు ఖాళీ లేకపోవడంతో ఐసీయూలో ట్రీట్మెంట్ చేయాల్సిన రోగులను కూడా జనరల్ వార్డుల్లోనే వదిలేస్తున్నారు.

బాధిత ప్రాంతాల్లో ఎక్స్ పెయిర్ అయిన మందులు పంపిణీ చేస్తున్నారు, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బ్లీచింగ్ చల్లలేదు. వ్యాధిని నిర్ధారించడానికి ఇప్పటివరకు ఎలాంటి పరీక్షలు చేశారు? ఏ ఏ ప్రాంతాల్లో నమూనాలు సేకరించారు? ఎలాంటి నమూనాలు సేకరించారు? సేకరించిన నమూనాలను ఎక్కడికి పంపిస్తున్నారు? రిపోర్ట్సు తాలుకు రిజల్ట్స్ ఏంటి? అనేది ఎప్పటికప్పుడు బులిటెన్ రిలీజ్ చేయాలి.

మెరుగైన వైద్యం పేరుతో రోగులను విజయవాడ, గుంటూరుకు పంపిస్తున్నారు. అయితే వెంటిలేటర్స్ తో కూడిన అంబులెన్సులు ఎక్కువ లేకపోవడంతో రోగి ప్రాణానికి ప్రమాదం పొంచి ఉంది.

అంతుబట్టని ఈ వ్యాధి మూలంగా ప్రాణాపాయ స్థితి కనిపించడం లేదు. అయితే ఒకరు చనిపోయారు అనే సమాచారం ఉన్నందున... సదరు మృతునికి సంబంధించిన హెల్త్ రిపోర్ట్స్ ను సమగ్రం విశ్లేషించడం అవసరం.
 

Follow Us:
Download App:
  • android
  • ios