తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల కంటే అత్యధిక స్థానాల్లో గెలిచి ఘన విజయం సాధించింది. అన్ని పార్టీలు ఏకమై వచ్చినా కేసీఆర్ తన వ్యూహ చతురతతో టీఆర్ఎస్‌ను రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చారు.

దీంతో ఆ పార్టీ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి అక్కడ పండుగ చేసుకోవడంలో తప్పులేదు. కానీ ఆశ్చర్యకరంగా టీఆర్ఎస్ విజయాన్ని ఏపీలోనూ సెలబ్రెట్ చేసుకుంటున్నారు.

ఆంధ్రాలో అధికారంలో ఉన్న టీడీపీ.. అక్కడి పార్టీలతో పొత్తు పెట్టుకుని మహాకూటమిగా ఏర్పడటం.. దానిని ప్రజలు చిత్తుగా ఓడించడం తెలిసిందే. దీంతో టీడీపీయేతర పక్షాలు ఏపీలో పండగ చేసుకుంటున్నాయి. రాజధాని ప్రాంతానికి చెందిన జనసేన కార్యకర్తలు, నేతలు టీఆర్ఎస్‌కు అభినందనలు తెలుపుతున్నారు.

అంతేకాకుండా ఆ పార్టీ అగ్రనేత కేటీఆర్‌ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్తలు.. మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషకం చేసి.. అనంతరం అనైతిక రాజకీయాలు నటించాలంటూ.. టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటన రాజధాని గ్రామాల్లో చర్చనీయాంశమైంది.

మరోవైపు తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటన జనసేన అధినేత పవన్ కల్యాణ్..ట్వీట్టర్ ద్వారా టీఆర్ఎస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్,కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు పార్టీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను విడుదల చేశారు.

‘ తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన గౌరవనీయులు శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి నా తరపున, జనసేన శ్రేణుల తరపున హృదయపూర్వక శుభాభినందనలు తెలుపుతున్నాను. ఈ తీర్పుతో తెలంగాణ ప్రజల విజ్ఞత మరోసారి రుజువైంది.

తెలంగాణ కోసం త్యాగాలు చేసిన, తెలంగాణను తెచ్చిపెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితికి, ఆ పార్టీ నాయకుడు శ్రీ కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు పట్టం కట్టి తమ మనసులోని మాటలను మరోసారి చాటి చెప్పారు. ఈ అఖండ విజయానికి సారధులైన శ్రీ కేసీఆర్ గారు, వారి కుమారుడు శ్రీ కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను.

తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను కేసీఆర్ గారు నెరవేరుస్తారన్న నమ్మకం నాలో సంపూర్ణంగా ఉంది. ఈ ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన శ్రీ హరీష్ రావు గారికి నా శుభాకాంక్షలు. విజయం సాధించిన ప్రతి ఒక్కరితోపాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు నా అభినందనలు’’ అని లేఖలో పవన్ పేర్కొన్నారు.