హైదరాబాద్‌ : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కార్తీక మాస దీక్షను చేపట్టారు. ప్రతీ ఏడాది పవన్ కళ్యాణ్ కార్తీకమాసంలో ఈ దీక్ష చేపట్టడం ఆనవాయితీగా వస్తుంది. హైదరాబాద్ లోని తన ఫాంహౌస్ లో ఈ దీక్ష చేపట్టారు పవన్ .

కార్తీకమాసం సందర్భంగా మెుక్కలు నాటారు. ఒక్కో రావి, వేప, మర్రి మొక్కలతోపాటు పది రకాల పూల మొక్కలు, ఐదు మామిడి మొక్కలు, రెండేసి దానిమ్మ, నారింజ మొక్కలు నాటినవారు నరకానికి వెళ్లరని చెప్పుకొచ్చారు. 

శ్రీ వరాహ పురాణంలో వేద వ్యాసుడు స్పష్టం చేశారని పవన్ కళ్యాణ్ తెలిపారు. భూదానం, గోదానం వల్ల ఎంత పుణ్యం వస్తుందో మొక్కలను నాటి సంరక్షించడం వల్ల అంతే పుణ్యం వస్తుందని శ్రీ వరాహ పురాణం చెప్తోందని పవన్ తెలిపారు. 

కార్తిక మాసంలో పార్టీ చేపట్టిన వన రక్షణ కార్యక్రమాన్ని మంగళవారం హైదరాబాద్‌ శివారులోని తన ఫాంహౌస్ లో పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వన రక్షణ అనే పేరును ఖరారు చేశారు పవన్ కళ్యాణ్.  

కార్తీక మాసంలో నిర్వహించే వన భోజనాలు వర్గ, కుల భోజనాలు కాకూడదని అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాల వారు కలిసి వన సంరక్షణ దిశగా వేసే వనసమారాధన వేదికలు కావాలని పవన్ పిలుపునిచ్చారు. 

వన రక్షణ కార్యక్రమం ఒక నెలకే పరిమితం కాదని నిరంతరాయంగా కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. జనసేన పార్టీ ప్రారంభించిన వన సంరక్షణ కార్యక్రమంలో మహిళలు, విద్యార్థులు, యువత భాగస్వామ్యం కావాలని పవన్ కోరారు. 

వనరక్షణ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లాకు చెందిన పద్మశ్రీ పురస్కారగ్రహీత వనజీవి రామయ్యని కలవబోతున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ జనసేన సిద్ధాంతాలలో ఒకటి అని పవన్ స్పష్టం చేశారు. ఈ సిద్ధాంతాన్ని ఆచరణలోకి తీసుకువచ్చే కార్యక్రమమే  వన రక్షణ అని తెలిపారు. 

ఈ పవిత్ర మాసంలో అందర్నీ కలుపుకొని పర్యావరణ పరిరక్షణలో భాగంగా మెుక్కలు నాటే కార్యక్రమాన్ని ఊరూరా చేపట్టాలని పవన్ పిలుపునిచ్చారు. ప్రతీ జనసేన నాయకుడు, జనసైనికుడు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగం కావాలని ఆకాంక్షించారు. 

మెక్కలు నాటడం మాత్రమేకాదు వాటిని పెంచి సంరక్షించడం కూడా మన బాధ్యత అని తెలిపారు. భారతదేశ సంస్కృతిలో మెుక్కలు నాటడం వాటిని సంరక్షించడం ఒక భాగమని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్.వేదాలు, పురాణాలు, కావ్యాల్లో మనం ప్రకృతిలో ఎలా మమేకం కావాలో చెప్పారని పవన్ కళ్యాణ్ తెలిపారు. 

అభివృద్ధి కావాలి అయితే పర్యావరణానికి విఘాతం కలిగించకూడదన్నారు. పర్యావరణాన్ని సంరక్షిస్తూ అభివృద్ధి సాధించాలని పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు సూచించారు. 
ఇకపోతే తాను కార్తీక మాస దీక్షను చేపట్టానని పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు. ఈ నెలంతా ఆయన ఘనాహారం స్వీకరించరని, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి. 

ఈ వార్తలు కూడా చదవండి

వనరక్షణలో పవన్ కళ్యాణ్(ఫోటోలు)