న్యూఢిల్లీ : అరకు మాజీ ఎంపీ, జనజాగృతి పార్టీ అధ్యక్షురాలు కొత్తపల్లి గీత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.  న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. 

ఈ సందర్బంగా గత ఏడాది ఆమె స్థాపించిన జనజాగృతి పార్టీని బీజేపీలో విలీనం చేశారు కొత్తపల్లి గీత. అంతకుముందు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తో ఆమె ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 

బీజేపీలో చేరే అంశం, పార్టీ విలీనంతోపాటు భవిష్యత్ లో తనకు న్యాయం చేయాలంటూ రామ్ మాధవ్ ను కోరినట్లు తెలుస్తోంది. అనంతరం రామ్ మాధవ్ నేతృత్వంలో ఆమె కమలం గూటికి చేరారు. 

ఇకపోతే 2014 ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అరకు లోక్ సభకు పోటీచేసి గెలుపొందారు కొత్తపల్లి గీత. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆమె టీడీపీకి అనుబంధంగా మారారు. 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్ వస్తుందని ఆశించి భంగపడ్డారు. దీంతో ఆమె జనజాగృతి పార్టీని స్థాపించి పోటీ చేసి ఘోరంగా ఓటమిపాలయ్యారు.