జనసేన, టీడీపీ పొత్తు : యనమల కృష్ణుడు ఎవరు? విరుచుకుపడుతున్న జనసైనికులు
టీడీపీ నేత యనమల కృష్ణుడిపై పాయకరావుపేట జనసైనికులు విరుచుకుపడుతున్నారు. అభ్యర్థులను ప్రకటించడానికి ఆయన ఎవరని ప్రశ్నిస్తున్నారు.

అనకాపల్లి : జనసేన, టిడిపి కలిసికట్టుగా అసెంబ్లీ ఎన్నికలకు పోతాయని పవన్ కళ్యాణ్ ప్రకటించినప్పటి నుంచి ఆ రెండు పార్టీలలో సీట్ల పంపిణీ విషయంలో లుకలుకలు మొదలయ్యాయి. జనసేన శ్రేణులు టిడిపి నేత యనమల కృష్ణుడి మీద విరుచుకుపడుతున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ను మాజీ ఎమ్మెల్యే, టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితకే అని చెబుతూ నియోజకవర్గ పరిశీలకుడిగా ఉన్న యనమల కృష్ణుడు ఇటీవల ప్రకటన చేశారు.
దీనిపైన జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించడానికి యనమల కృష్ణుడు ఎవరు? అంటూ వారు తీవ్రస్థాయిలో ప్రశ్నిస్తున్నారు. పరిశీలకులకు అభ్యర్థులను ప్రకటించే అధికారం లేదని తేల్చి చెప్పారు. ఆదివారం జనసేన రాష్ట్ర కార్యదర్శి, కాపునేత గెడ్డం బుజ్జి మీడియాతో ఈ విషయం మీద మాట్లాడారు. పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి అనితకు టికెట్ ఇస్తే జనసేన కార్యకర్తలు ఆమెకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని హెచ్చరికలు జారీ చేశారు.
జనసేనకు బిగ్ షాక్.. మేడా గురుదత్త ప్రసాద్ రాజీనామా..
యనమల కృష్ణుడికి ఇక్కడి విషయాలు తెలియని.. వంగలపూడి అనిత నియోజకవర్గంలో వ్యవహరించే విధానం తెలియదన్నారు. జనసేనతో పాటు, కాపులను, టిడిపి కార్యకర్తలను ఆమె తీవ్రంగా ఇబ్బందులు పెట్టిందని.. ఈ విషయాలు తెలియక యనమల రామకృష్ణుడు మాట్లాడేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. వంగలపూడి అనితకు 2014లో ఎమ్మెల్యే పదవి భిక్ష పెట్టింది జనసేన పార్టీ అని.. తమ మద్దతుతోనే ఆమె గెలిచిందని గెడ్డం బుజ్జి అన్నారు.
పదవిలోకి వచ్చిన వెంటనే వంగలపూడి అనిత తన మీద రేప్ కేసు పెట్టించిందని.. జనసేన కార్యకర్తలను తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని దుయ్యబట్టారు. కాపులకు వంగలపూడి అనిత వ్యతిరేకి అని.. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అనిత చెప్పుతో కొట్టిందని గుర్తు చేశారు. జనసేన, టిడిపి పొత్తులో భాగంగా పాయకరావుపేట నియోజకవర్గ టికెట్ జనసేనకే కేటాయించాలని… జనసేన కార్యకర్తలు కోరుతున్నారన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లే పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఎవరికి ఇవ్వాలనేది నిర్ణయిస్తారని చెప్పుకొచ్చారు.