Nagababu: కూటమి ప్రభుత్వం వచ్చి నెల రోజులే అయింది... వైసీపీ కాట్ల కుక్కలా మీదపడుతోంది: నాగబాబు
‘అబద్దాలు చెప్పడంలో జగన్ డాక్టరేట్ పొందారు. జంగారెడ్డి గూడెంలో కల్తీసారా తాగి పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తే... అసెంబ్లీ సాక్షిగా అవి సహజ మరణాలని చెప్పారు.’
ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం బాగుండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. చంద్రబాబు లాంటి గొప్ప అడ్మినిస్ట్రేటర్ ముఖ్యమంత్రి, మానవతావాది పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటకముందే వైసీపీ నాయకులు పనికిమాలిన కామెంట్లు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు తాము 6 నెలల సమయం ఇచ్చామని గుర్తుచేశారు. వాళ్లు కనీసం మూడు నెలల సమయం కూడా ఇవ్వకుండా కాట్ల కుక్కల్లా మీద పడుతున్నారంటూ వైసీపీ తీరుపై మండిపడ్డారు. వాళ్లకు యాంటీ రాబీస్ ఇంజక్షన్ వేసి సైలెంటుగా కూర్చొబెడతామని హెచ్చరించారు. వైసీపీ హయాంలో అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్కరూ కూడా తప్పించుకోలేరన్నారు. చేసిన కర్మకు ప్రతిఫలం అనుభవించాల్సిందేనన్నారు.
మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో క్రియాశీలక సభ్యులకు సంబంధించిన బీమా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. నాగబాబు హైజరయ్యారు. వేర్వేరు ప్రమాదాల్లో చనిపోయిన 81 మంది జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున బీమా పరిహారం చెక్కుల పంపిణీ చేశారు. దశాబ్ద కాలంగా సాగిన రాజకీయ ప్రయాణంలో పవన్ కళ్యాణ్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని, ఎంతోమందితో మాటలు పడ్డా ప్రజాసేవ చేయాలనే ఒకే ఒక్క ఆకాంక్షతో ముందుకు కదిలారని గుర్తుచేశారు. ఎంతో మందికి పవన్ కళ్యాణ్ చేతనైన సాయం అందించారని... అందుకే ఆయన ఈ స్థితిలో ఉన్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి జేబులో నుంచి పది రూపాయలు తీసి ఇవ్వడం తాను ఇంతవరకు చూడలేదని చెప్పారు.
అబద్దాలు చెప్పడంలో జగన్ డాక్టరేట్ పొందారని విమర్శించారు. జంగారెడ్డి గూడెంలో కల్తీసారా తాగి పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తే... అసెంబ్లీ సాక్షిగా అవి సహజ మరణాలని చెప్పారని నాగబాబు గుర్తుచేశారు. ఇప్పుడు కూడా వినుకొండలో పాత కక్షల వల్ల ఒకరు హత్యకు గురైతే దానికి రాజకీయ రంగు పులుముతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు నాశమవుతున్నాయని, రాష్ట్రపతి పాలన పెట్టాలని మాట్లాడుతున్నారని, ఇంతకన్నా దిగజారరు అనుకున్న ప్రతిసారి ఆయన దిగజారి మాట్లాడుతున్నారని నాగబాబు అన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంచిదారిలో నడిస్తే ఓ పది, పదిహేనేళ్లకు మళ్లీ ప్రజలు ఆశీర్వదిస్తారని హితవు పలికారు.