తిరుపతి: తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక విషయంలో బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు అనుసరిస్తున్న వైఖరి పట్ల జనసేన అధినేత పనవ్ కల్యాణ్ తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. సోము వీర్రాజు ఏకపక్ష వైఖరిపై ఆయన అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దాంతో పవన్ కల్యాణ్ తన పార్టీ శ్రేణులకు సోము వీర్రాజును తిప్పికొట్టేందుకు అవసరమైన వ్యూహాన్ని అనుసరించాలని నిర్దేశించినట్లు తెలుస్తోంది. 

తిరుపతి ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారని సోము వీర్రాజు ఏకపక్షంగా ప్రకటించడాన్ని పవన్ కల్యాణ్ జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. దాంతో జనసేన నాయకులు సోము వీర్రాజుపై విమర్శలకు దిగుతున్నారని అంటున్నారు. తమను సంప్రదించకుండా సోము వీర్రాజు ఆ ప్రకటన ఎలా చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. 

Also Read: తిరుపతిలో టీడీపీ వ్యూహకర్త మకాం: ఎవరీ రాబిన్ శర్మ?

గత ఎన్నికల్లో బిజెపికి నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చాయని గుర్తు చేస్తూ తమను సంప్రదించుకుండా సోము వీర్రాజు ఆ ప్రకటన ఎలా చేస్తారని అడుగుతున్నారు. ఈ స్థితిలో తిరుపతి సీటుపై పవన్ కల్యాణ్ ఓ కమిటీని వేశారు. తిరుపతిలో బలమైన సామాజిక వర్గం తమ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని, ఓవీ రమణ వంటి వారి విషయంలో సోము వీర్రాజు తీసుకున్న నిర్ణయాలు ఆ వర్గానికి నచ్చలేదని అంటున్నారు. 

తిరుపతి శానససభ సీటు నుంచి పవన్ కల్యాణ్ సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి విజయం సాధించిన విషయాన్ని జనసేన నాయకులు గుర్తు చేస్తున్నారు. బిజెపి పోటీ చేసినా విజయ సాధించే అవకాశం లేదని, తమ పార్టీ పోటీ చేస్తే విజయావకాశాలు ఉంటాయని పవన్ కల్యాణ్ వేసిన కమిటీ ఓ నిర్ధారణకు వచ్చిందని చెబుతున్నారు. కమిటీ నివేదిక నేపథ్యంలో పవన్ కల్యాణ్ తిరుపతి నియోజకవర్గం నాయకులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. తమ పార్టీ అభ్యర్థే రంగంలో ఉంటారని ఆయన సూచనప్రాయంగా తెలియజేసినట్లు సమాచారం. 

ఈ స్థితిలో జనసేన నేత కిరణ్ మీడియా ముదుకు వచ్చి సోము వీర్రాజుపై విరుచుకుపడ్డారు. తిరుపతిలో బిజెపి అభ్యర్థి పోటీ చేస్తారని ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారని ఆయన అడిగారు. బిజెపి జాతీయాధ్యక్షుడు జెపి నడ్డా, తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చర్చించుకుని ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయిస్తారని ఆయన అన్నారు. ఇందులో సోము వీర్రాజుకు ఏ విధమైన పాత్ర ఉండదని, సోము వీర్రాజు ఏకపక్ష ప్రకటన చెల్లుబాటు కాదని ఆయన చెప్పకనే చెప్పారు.