హైదరాబాద్: వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జనసేన చీఫ్, సినిమా హీరో పవన్ కల్యాణ్ కొద్దిగా రాజకీయాల గురించి కూడా ప్రస్తావించారు. తాను సినిమాల్లో నటించడానికి గల కారణాన్ని వివరించారు. ఎమ్మెల్యే వేతనం లక్షకు కాస్తా పైగా ఉంటుందని చెప్పి, తాను సినిమాల్లో నటించడానికి గల కారణాన్ని చెప్పారు.

అవినీతికి పాల్పడడం ఇష్టం లేదు కాబట్టి తాను సినిమాల్లో నటిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే, ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడి డబ్బులు సంపాదిస్తున్నారనే విషయాన్ని ఆయన నేరుగా చెప్పకపోయినప్పటికీ ఆ విషాయన్నే చెప్పారని అర్థం చేసుకోవడానికి వీలుంది. 

పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మానవ హక్కుల కోసం పోరాడినవారిని కూడా ప్రస్తావించారు. క్యాన్సర్ తో బాధపడుతూ కెమో థెరపీ తీసుకుంటూ చుండూరు బాధితుల తరఫున వాదించిన న్యాయవాది గురించి ప్రస్తావించారు. న్యాయవాదులంటే తనకు గౌరవం ఉందని ఆయన అన్నారు. అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా కోర్టులో వాదించిన నానీ పాల్కీవాలా తనకు చాలా ఇష్టమని చెప్పారు. 

అదే సమయంలో మానవ హక్కుల కోసం పోరాటం చేసిన బాలగోపాల్ ను కూడా ప్రస్తావించారు. ఈ స్థితిలో వకీల్ సాబ్ సినిమాలో బాధితుల తరఫున న్యాయవాది పాత్రను పోషించే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. 

తాను కొత్త దర్శకులకు ఎక్కువగా అవకాశం ఇచ్చిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. వకీల్ సాబ్ సినిమా దర్శకుడు వేణులో ప్రతిభ ఉందని, తపన ఉందని, నిజాయితీ ఉందని ఆయన ప్రశంసించారు. హరీష్ శంకర్ వంటి దర్శకులను కూడా ఆయన ప్రస్తావించారు. వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హైదరాబాదులో జరిగిన విషయం తెలిసిందే.