బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ భేటీ.. ఏపీలో పరిస్థితులపై చర్చ..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో ఎన్డీయే సమావేశానికి హాజరైన అనంతరం.. బీజేపీ అగ్రనేతలతో వరుసగా సమావేశమవుతున్నారు. తాజాగా గురువారం ఉదయం పవన్ కల్యాణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు.

న్యూఢిల్లీ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో ఎన్డీయే సమావేశానికి హాజరైన అనంతరం.. బీజేపీ అగ్రనేతలతో వరుసగా సమావేశమవుతున్నారు. తాజాగా గురువారం ఉదయం పవన్ కల్యాణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ మార్పు తర్వాత పరిణామాలు, ఎన్నికలకు సిద్దం అవ్వడంతో పాటు తదితర అంశాలపై ఈ భేటీలో పవన్, జేపీ నడ్డాలు చర్చించినట్టుగా సమాచారం. దాదాపు గంట పాటు ఈ సమావేశం జరిగింది.
ఈ భేటీకి సంబంధించి జేపీ నడ్డా ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం గురించి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో విస్తృత చర్చలు జరిపినట్లు నడ్డా పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశ ప్రగతికి అవిశ్రాంతంగా కృషి చేస్తోందని తెలిపారు. ఇక, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పవన్‌తో పాటు జేపీ నడ్డాను కలిశారు. ఇక, బుధవారం పవన్ కల్యాణ్.. కేంద్రమంత్రులు మురళీధరన్, అమిత్ షాతో సమావేశమై చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ బుధవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అరగంటకుపైగా సాగిన సమావేశంలో.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన చర్యలపై అమిత్ షాతో పవన్ చర్చించినట్టుగా తెలుస్తోంది. ‘‘ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో అద్భుతమైన సమావేశం జరిగింది. ఈ సమావేశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిర్మాణాత్మక, నిర్ణయాత్మక మరియు సుసంపన్నమైన భవిష్యత్తుకు దారితీస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను!’’ అని అమిత్ షాతో భేటీపై పవన్ ట్వీట్ చేశారు.