అమరావతి: బిజెపికి, జనసేనకు మధ్య ఒప్పందం ఖరారైనట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. బిజెపి అగ్రనేతలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కలిసి నడవాలని ఇరు పార్టీల మధ్య అవగాహన కుదిరినట్లు చెబుతున్నారు. 

తాను బిజెపికి దూరమయ్యానని ఎవరు చెప్పారని అడుగుతూ తాను దూరం కాలేదని పవన్ కల్యాణ్ ఇటీవల వ్యాఖ్యలు చేసినప్పుడే ఆయన దారి ఏమిటో అర్థమైందని అంటున్నారు. మోడీ, అమిత్ షాల నాయకత్వాలను ఆయన ప్రశంసించారు కూడా.

బిజెపితో కలిసి నడవాలనే నిర్ణయానికి రావడం వల్లనే పవన్ కల్యాణ్ ఆ మాటలన్నట్లు ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే పవన్ కల్యాణ్ అడుగులు పడుతున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆయన రెండు రోజుల పాటు ఢిల్లీలో రహస్య భేటీలు సాగించినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బిజెపి పెద్దలతో ఆ భేటీలు జరిగినట్లు చెబుతున్నారు. 

హిందూత్వ నినాదాన్ని ఎత్తుకోవడం ద్వారా ఆయన తన వైఖరిని స్పష్టం చేశారని అంటున్నారు. ఇటీవలి కాలంలో ఆయన హిందూత్వకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. మతమార్పిడులపై మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో మతమార్పిడులు జరుగుతున్నాయని ఆయన దుమ్మెత్తి పోస్తూ వస్తున్నారు. 

తాడేపల్లిలోని జగన్ నివాసానికి కూతవేటు దూరంలోనే సామూహిక మతమార్పిడులు జరుగుతున్నాయని ఆయన ఇటీవల వ్యాఖ్యానించారు. జగన్ కులాన్ని కూడా ఆయన లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ ఒక్క కులానికి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పడానికి తాను జగన్ రెడ్డి అనే పిలుస్తానని ఒకటికి రెండు సార్లు అన్నారు. 

వచ్చే ఎన్నికల నాటికి బిజెపికి, జనసేనకు మధ్య మరింత సాన్నిహిత్యం పెరగవచ్చునని అంటున్నారు. గత ఎన్నికల్లో జనసేన  ఒక్క అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. అయితే, జనసేనకు ఆరు శాతం ఓట్లు వచ్చాయి. బిజెపితో కలిసి నడిస్తే ఇరు పార్టీల ఓట్లు జత కలిసి వైఎస్సార్ కాంగ్రెసును చిక్కులు తెచ్చిపెడుతాయని భావిస్తున్నారు. సమయానికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని కూడా కలుపుకోవచ్చుననే ఆలోచనలో బిజెపి నేతలు ఉన్నట్లు చెబుతున్నారు. 

అయితే, బిజెపి నేతల వ్యాఖ్యలు మాత్రం కొంచెం భిన్నంగానే ఉన్నాయి. జనసేనను తమ పార్టీలో విలీనం చేస్తే తమకు అభ్యంతరం లేదని బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. జనసేనతో పొత్తు ఉండదని, విలీనానికి మాత్రమే తాము సుముఖంగా ఉన్నామని ఆయన అన్నారు. ఎన్నికలకు ఇంకా చాలా కాలం ఉంది.