అమరావతి: నివర్ తుఫాన్ కారణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల వల్ల ఈ నెల 26 న ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కావలసివున్న జగనన్న అమూల్ ప్రాజెక్టు మొదటి దశ కార్యక్రమాన్ని ప్రభుత్వం డిసెంబర్ 2 కి వాయిదా వేసినట్టు సమాచార, పౌరసంబంధాల శాఖ కమీషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
    
మహిళా సాధికారత, సుస్థిర ఆర్ధికాభివృద్ధి లక్ష్యాలుగా “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం -అమూల్ ప్రాజెక్టు” సంయుక్త భాగస్వామ్యంతో “జగనన్న- అమూల్ పాలవెల్లువ” కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశలలో రూ. 3,034 కోట్ల వ్యయంతో 9,899 ప్రాంతాల్లో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, పాలసేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని ఆయన తెలిపారు. మొదటి దశలో పైలెట్ ప్రాజెక్టు క్రింద ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోని 400 గ్రామాలలో ప్రారంభం అవుతుందన్నారు. 

అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకొని అధిక పాలదిగుబడి ఇచ్చే సంకర జాతి ఆవులు, ముర్రా, గ్రేడేడ్ ముర్రా తదితర మేలు జాతి గేదెలు రాష్ట్రంలోనే గాక గుజరాత్, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, తెలంగాణ, తదితర రాష్ట్రాల నుండి కూడా కొనుగోలు చేసుకొనే వెసులుబాటు రైతులకు లభిస్తుందని తెలిపారు. రైతులు కోరుకున్న పశువులు కొనుక్కొనే సౌలభ్యం ఉంటుందని, పశువుల కొనుగోలులో రైతుల నిర్ణయమే అంతిమంగా ఉంటుందని తెలిపారు.   

అమూల్ భాగస్వామ్యం తో  పాల సేకరణ ద్వారా పాడి  రైతులకు లీటర్ కు రూ .5/- నుండి రూ . 10/- ల   అదనపు ఆదాయం లభిస్తుందన్నారు. రాష్ట్రంలో పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, వినియోగదారులకు నాణ్యమైన పాలు, పాల పదార్ధాలు అందించడమే జగనన్న ప్రభుత్వం లక్ష్యమని కమీషనర్ ఆ ప్రకటనలో తెలిపారు.
 
డీజీపి ఆదేశాలు

ఈ రోజు అర్ధరాత్రి నుంచి పోలీసుశాఖ ఎస్డీఆర్ఎఫ్ తో సహా  ప్రతి ఒక్కరు రాత్రి పగలు అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా ఉంటారని ఏపీ డిజిపి చెప్పారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు లోతట్టు, ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంలో  పోలీసుశాఖ చొరవ చూపాలని ఆయన సూచించారు.

ముంపు ప్రాంతాలు వరద తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాలను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని, ఏపి డిజిపి కలెక్టర్లు,యన్ డి ఆర్ ఎఫ్, అగ్నిమాపక శాఖ  అన్ని శాఖల  సిబ్బందితో సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఏపి డిజిపిడయల్ 100/112 సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు ఆయన మనవి చేశారు.

నివర్‌ తుఫాన్‌ దూసుకొ స్తుండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రస్తుతం కడలూరుకు తూర్పు ఆగ్నేయంగా 290 కి.మీ, పాండిచ్చేరికి 300 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 350 కి.మీ దూరంలో తుపాను కేంద్రీకృత మైంది. మరో 12 గంటల్లో అతి తీవ్ర తుపాన్‌గా మారే ప్రమాదం ఉంది. ప్రస్తుతం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా చెన్నైకి ఆగ్నేయ దిశలో తుఫాను కేంద్రీకృతమైంది.

ఆర్థరాత్రి తీరం దాటే అవకాశం

ఈ అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారు జామున కరైకల్‌, మహాబలిపురం వద్ద నివర్‌ తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుఫాన్ ప్రభావం కోస్తా అంతటా కనిపిస్తుంది.నివర్ ప్రభావంతో ఈ రోజు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణం శాఖ అధికారులు చెబుతున్నారు.