అమరావతి:ఏపీ శాసనమండలి విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందనే విషయమై ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఏపీ శాసనమండలిని రద్దు చేయాలని కోరుతూ అసెంబ్లీ ఈ ఏడాది డిసెంబర్ 27వ  తేదీన తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది.ఈ తీర్మానంపై కేంద్రం ఎలా వ్యవహరిస్తోందో చూడాలి.

ఏపీ శాసనమండలిని రద్దు చేయాలని అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించాల్సి ఉంటుంది.  ఆ తర్వాత దీన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం కోసం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.

పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ బిల్లులు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారు. రాష్ట్రతి ఆమోదం పొందిన తర్వాత శాసనమండలి రద్దు విషయమై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది.

పార్లమెంట్ ఏపీ శాసనమండలి రద్దు విషయాన్ని త్వరగా ఆమోదించేలా చేయాలని ఏపీ సీఎం జగన్ కోరుకొంటున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ఆమోదం పొందేలా జగన్ అన్ని రకాల ప్రయత్నాలను ఉపయోగించుకొంటున్నారు.

ఏపీ శాసనమండలి రద్దు చేయాలనే జగన్ ఆలోచనను టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.టీడీపీకి చెందిన 15 మంది ఎమ్మెల్సీలను బీజేపీ కేంద్ర నాయకత్వం వద్దకు పంపాలని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. 

శాసనమండలి రద్దు నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకిస్తోందో టీడీపీ  ఎమ్మెల్సీలు  బీజేపీ నాయకత్వానికి వివరించనున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆ పార్టీకి చెందిన ఎంపీలకు ఏపీ శాసనమండలి రద్దు విషయాన్ని  ఎప్పటికప్పుడు ఫాల్ అప్ చేయాలని  ఆదేశించారు.

ఈ సెషన్ లో  ఏపీ శాసనమండలి రద్దు బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం లేదని  అధికార వర్గాలు తెలిపాయి.ఈ ఏడాది మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉండే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నాయి. ఏపీ శాసనమండలి కూడ సమావేశం కానుంది.మార్చిలోనే పార్లమెంట్ లో ఏపీ శాసనమండలి రద్దు బిల్లును ప్రవేశపెట్టి, ఉభయ సభల్లో ఆమోదం పొందితే ఏపీ శాసనమండలికి ఫిబ్రవరిలో జరిగే సమావేశాలే చివరివి అయ్యే అవకాశం ఉంటుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీ సీఎం వైఎస్ జగన్ పట్ల సానుకూల థృక్పథంతో ఉన్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.  ప్రధానిగా నరేంద్రమోడీ రెండో దఫా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీ సీఎం వైఎస్ జగన్ నాలుగు దఫాలు ఆయనను వేర్వేరు సమయాల్లో కలిశారు. కానీ, చంద్రబాబునాయుడు ఇంతవరకు మోడీని కలవలేదు.

రాజ్యసభలో కొన్ని కీలక బిల్లుల ఆమోదం కోసం ఎగువ సభలో వైసీపీ ఎంపీల అవసరం ఎన్డీఏకు అవసరం. దీంతో ఏపీ సీఎం జగన్ పట్ల ఏపీ సీఎం జగన్ పై సానుకూల థృక్పథంతో ఉన్నారనే అభిప్రాయాలు పొలిటికల్ సర్కిళ్లలో ఉన్నాయి.

వైసీపీకి 22 మంది ఎంపీలు లోక్‌సభలో  ఉన్నారు. రాజ్యసభలో ఆ పార్టీకి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. ఇక టీడీపీకి లోక్‌సభలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో ఇద్దరు సభ్యులున్నారు.

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో టీడీపీకి చెందిన ఓ సభ్యుడు  రిటైర్ కానున్నారు. అదే నెలలో రాజ్యసభలో వైసీపీ బలం ఆరుకు పెరగనుంది. దీంతో భవిష్యత్తులో రాజకీయ సమీకరణాల దృష్ట్యా జగన్ వైపే కేంద్రం కొంచెం మొగ్గును చూపే అవకాశాలను కొట్టిపారేయలేమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.