అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీడియో వార్ ప్రారంభించారు. చంద్రబాబు కీలకమైన అంశాలపై యూటర్న్ తీసుకున్న వైనంపై వీడియోలను ప్రదర్శిస్తూ వైఎస్ జగన్ విమర్శలకు దిగే వ్యూహానికి తెరలేపారు. 

రాజధాని అంశం కీలకమైన దశకు చేరుకున్న నేపథ్యంలో కూడా శాసన మండలి రద్దు నుంచి, తెలంగాణ రాష్ట్రంతో స్నేహం వరకు వివిధ అంశాలపై వైఖరులను మార్చుకున్న తీరుపై జగన్ చంద్రబాబును వీడియోలను చూపించి ఎదురుదాడికి దిగుతున్నారు. 

శాసన మండలి రద్దుపై చంద్రబాబు గతంలో చెప్పిన విషయాన్ని, ఇప్పుడు మాట్లాడుతున్న తీరును చెప్పడానికి జగన్ వీడియోలు ప్రదర్శించి చూపించారు. చంద్రబాబు కీలకమైన అంశాలపై ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని ఆయన విమర్శించారు. 

ఎపీకి ప్రత్యేక హోదాపై, ప్రధాని నరేంద్ర మోడీపై, కాంగ్రెసుతో సంబంధాలపై, మండలి రద్దుపై చంద్రబాబు ఏ విధంగా మాట మార్చారనే విషయాన్ని చెప్పడానికి వీడియోలను ప్రదర్శించారు. 

వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో శాసన మండలి పునరుద్ధరణను చంద్రబాబు వ్యతిరేకించారు. ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందని, ఎన్నికల ఓడిపోయినవారికి రాజకీయ పునరావాసం కల్పించడానికి మాత్రమే ఉపయోగపడుతుందని, చట్టసభల ప్రక్రియలో జాప్యం జరుగుతుందని చంద్రబాబు ఆ సమయంలో అన్నారు. 

అప్పుడు చంద్రబాబు ఆ మూడు అంశాలపై తీసుకున్న వైఖరిని, ఇప్పుడు అనుసరిస్తున్న వైఖరిని బేరీజు వేస్తూ జగన్ ప్రభుత్వం తీవ్రంగా మండిపడుతోంది. వీడియోలను శాసనసభలో ప్రదర్శిస్తూ చంద్రబాబు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరులను ఎత్తిచూపుతున్నప్పుడు శాసనసభలో పెద్ద పెట్టున నవ్వులు చోటు చేసుకున్నాయి. 

ఇప్పుడు కూడా చంద్రబాబు వీడియోల ప్రదర్శన ద్వారా జగన్ కు కౌంటర్ ఇవ్వడానికి ప్రయత్నించారు. ప్రత్యేక కెటగిరీ సాధనకు పోరాటం చేస్తానని చెప్పిన వైఎస్ జగన్ కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ అయ్యారని చెప్పడానికి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు వీడియోలను ప్రదర్శించారు. తెలంగాణ రాష్ట్రంతో సంబంధాలపై జగన్ తన వైఖరిని మార్చుకున్న తీరును కూడా వీడియోలు ప్రదర్శించి చూపించారు.