తానుగా ఎందుకు ఇరుక్కుంటున్నారు ?

Jagan him self giving chance to opponents
Highlights

జగన్ కు రాజకీయంగానే కాకుండా మీడియాలో కూడా శత్రువులెక్కువ. అటువంటప్పుడు ప్రత్యర్ధులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. ఇస్తే....అసలుకన్నా కొసరే ఎక్కువ హైలైట్ అవుతుందన్న విషయం జగన్ గుర్తుంచుకోవాలి.

యుద్ధంలో శత్రువుతో పోరాడాలంటే మన చేతిలో కత్తి, డాలు ఉంటే సరిపోదు. ప్రత్యర్ధి బలం, బలహీనతల గురించి కూడా బాగా అధ్యయనం చేయాలి. లేకపోతే ఎదురుదెబ్బలు తప్పవు. వైసీపీ అధ్యక్షుడు జగన్ విషయంలో అదే జరుగుతోంది. తనంతట తానుగా వెళ్లి ప్రత్యర్ధికి అవకాశం ఎందుకు ఇస్తున్నారో అర్ధం కావటం లేదు. భూమా మరణంపై అసెంబ్లీలో సంతాప తీర్మానానికి వైసీపీ హాజరుకాకపోవటం ఇపుడు పెద్ద రచ్చ అయిపోయింది.

 

అధికారపార్టీ ప్రవేశపెట్టే సంతాప తీర్మానంలో పాల్గొనటం జగన్ కు ఇష్టం లేదు. అయితే, ఎందుకు పాల్గొనలేదనే చర్చ అయితే జరుగుతుంది కదా. అప్పుడు ఏదో ఒక కారణం చెప్పాలి కదా. చెప్పే కారణాలు కూడా జనాలు మెచ్చే విధంగా ఉండాలి. కానీ జగన్ చెబుతున్నదేమిటి? సంతాప తీర్మానంలో పాల్గొంటే భూమా మంచితో పాటు చెడు కూడా చెప్పాల్సి వస్తుందట. సంతాప సభలో ఎవరైనా మరణించిన వారి గురించి చెడుగా మాట్లాడుతారా?

 

వైసీపీలో ఉన్న భూమాను మంత్రిపదవి ఆశచూపి ప్రలోభపెట్టి లాక్కున్నారని చెప్పారు. మానసికంగా హింసించి మరణానికి కారణమైన చంద్రబాబు ప్రవేశపెట్టే తీర్మానంలో పాల్గొనటం ఇష్టం లేకే సభకు రాలేదన్నారు. మరి చెప్పాల్సింది చంద్రబాబు గురించి అయితే, మధ్యలో భూమా మంచి, చెడు రెండూ చెప్పాలని అనటమేమిటి? చంద్రబాబు పైన ఆరోపణలు చేసి వదిలేసుంటే బాగుండేది.

 

ఆమధ్య ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో కూడా అదే జరిగింది. మరణించిన వారి బంధువులను పరామర్శించేందుకు జగన్ వెళ్ళారు. అక్కడా కలెక్టర్, డాక్టర్ తో గొడవ పెట్టుకున్నారు. ఫలితంగా ప్రమాదం విషయం పక్కకుపోయి జగన్ గొడవే హైలైట్ అయింది. ఇక ప్రత్యేకహోదా విషయంలో జనవరి 26వ తేదీన విశాఖపట్నంలో క్యాండిల్ ర్యాలీకి వెళ్లినపుడు విమానాశ్రయంలో జగన్ భైటాయింపు అంశమే పెద్దదైపోయింది. అసలే జగన్ కు రాజకీయంగానే కాకుండా మీడియాలో కూడా శత్రువులెక్కువ. అటువంటప్పుడు ప్రత్యర్ధులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. ఇస్తే....అసలుకన్నా కొసరే ఎక్కువ హైలైట్ అవుతుందన్న విషయం జగన్ గుర్తుంచుకోవాలి.

 

loader