Asianet News TeluguAsianet News Telugu

నన్ను మోసం చేశారనడానికి ఆధారల్లేవు కానీ... అంతా దేవుడికి తెలుసు... ఏడ్చేసిన జగన్‌

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయన ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. భావోద్వేగపూరితంగా ప్రసంగించారు. లక్షల కోట్లు ఖాతాల్లో వేసి మంచి చేసినా జనం తనను ఆదరించేలేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 
 

Jagan Emotional Comments After Election Results
Author
First Published Jun 4, 2024, 9:39 PM IST

ఐదేళ్ల పాలనలో అధిక మొత్తం బడ్జెట్‌ను సంక్షేమానికి ఖర్చుపెట్టిన జగన్‌ ఘోర పరాభవాన్ని చూసి తల్లడిల్లిపోయారు. అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతల అప్యాయత ఏమైందోనంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయన ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. భావోద్వేగపూరితంగా ప్రసంగించారు. లక్షల కోట్లు ఖాతాల్లో వేసి మంచి చేసినా జనం తనను ఆదరించేలేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 

''ఫలితాలు చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ఇలా జరుగుతుందని ఊహించలేదు. అమ్మ ఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేసినం. పిల్లలు బాగుండాలి, వారి చదువులు బాగుండాలని తాపత్రయంతో అడుగులు వేశాం. మరి ఆ అక్కచెల్లెమ్మల ఓట్లేమయ్యాయో తెలియదు. 66 లక్షల మంది అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులకు గతంలో ఎన్నడూ లేని విధంగా మంచి చేశాం. గతంలో ఎన్నడూ లేని విధంగా వారి ఇళ్లకే వెళ్లి పింఛన్లు ఇచ్చాం....  ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో తెలియదు. దాదాపు కోటీ 5 లక్షల మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ.. వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ... అసరా, సున్నా వడ్డీ, చేయూతతో తోడుగా ఉన్నా. మరి ఆ కోటీ 5లక్షల మంది ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియదు. ''

 

'' పేదలకు అండగా ఉన్నాం. మహిళా సాధికారిత, సామాజిక న్యాయం అంటే ఇది అని ప్రపంచానికి చూపించగలిగాం. మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత, కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత, అభిమానం ఏమైందో...? ఆప్యాయత ఏమైందో..? తెలియదు. ఎవరో మోసం చేశారు అన్యాయం చేశారు అనొచ్చుగానీ, ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. నేనైతే చేయగలిగిందేమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాం. కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా కచ్చితంగా ఉంటాం. వాయిస్‌ ఆఫ్‌ ది వాయిస్‌ లెస్‌ కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది. ఎప్పుడూ పేదవాడికి అండగా ఉంటూ గళం విప్పుతుంది. పేదవాడికి అండగా నిలుస్తుంది'' అని జగన్‌ పేర్కొన్నారు. 


''పెద్దపెద్ద వాళ్ల కూటమి ఇది. ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితి ఉన్న కూటమి. ఆ కూటమిలో ఉన్న బీజేపీకి, చంద్రబాబుకు, పవన్‌ కల్యాణ్‌కు అభినందనలు. ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో తోడుగా ఉన్న ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి, ప్రతి వాలంటీర్‌కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చి స్టార్‌ క్యాంపెయినర్లుగా తోడుగా నిలిచిన ప్రతి అక్కచెల్లెమ్మకు, అన్నదమ్ములకు మనస్ఫూర్తిగా కృతజ్నతలు తెలియజేస్తున్నా. ఏం జరిగిందో తెలియదు గానీ, ఏం చేసినా ఎంత చేసినా 40 శాతం ఓటుబ్యాంకును తొలగించలేకపోయారు. గుండె ధైర్యంతో నిలబడి మళ్లీ లేస్తాం. ప్రతిపక్షంలో ఉండటం కొత్త కాదు. పోరాడటం కొత్త కాదు. నా రాజకీయ జీవితమంతా ప్రతిపక్షంలోనే గడిపా.. ఈ ఐదేళ్లు తప్ప. పోరాటాలే చేశా. రాజకీయ జీవితంలో ఎవరూ చూడని కష్టాలు అనుభవించా. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ కష్టాలు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నం. ఆల్‌ ద వెరీ బెస్ట్‌ గవర్నమెంట్‌లోకి వచ్చిన వారికి...'' అని జగన్‌ ప్రెస్‌మీట్‌ ముగించారు. కొత్త ప్రభుత్వం ఎలా ఉండబోతోందని విలేకరులడిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు...

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios