మా బావకు జగన్ అన్యాయం చేశారు - మర్రి రాజశేఖర్ బావమరిది వెంకటసుబ్బయ్య ఆరోపణ
ఎమ్మెల్సీ టిెకెట్ ఇవ్వకుండా తన బావకు సీఎం జగన్ అన్యాయం చేశారని మాజీ ఎమ్మెల్యే సోమేపల్లి సాంబయ్య కుమారుడు వెంకటసుబ్బయ్య ఆరోపించారు. దివంగత నేత రోషయ్య సంస్మరణ సభ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏపీ సీఎం జగన్ తన బావ మర్రి రాజశేఖర్‌కు అన్యాయం చేశారని మాజీ ఎమ్మెల్యే సోమేపల్లి సాంబయ్య కుమారుడు వెంకటసుబ్బయ్య ఆరోపించారు. దివంగత నేత రోషయ్య సంస్మరణ సభ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ పాల్గొనని వెంకట సుబయ్య ఇలా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. రాజకీయాల్లో తండ్రి ఉన్నప్పటికీ ఆయనకు సహాయంగా ఉన్నారే తప్ప తెర ముందు ఎప్పుడూ కనిపించలేదు. చిలకలూరిపేట ఎమ్మెల్యే టికెట్టును రజినీకి ఇచ్చినప్పుడు కూడా తామేం బాధపడలేదని, పార్టీ కోసమే కష్టపడ్డామని అన్నారు. తమకు సముచిత స్థానం ఇస్తానని చెప్పిన వైసీపీ నేతలు ఇప్పుడు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వైసీపీ ఏర్పడిన నాటి నుంచి పార్టీ కోసం పని చేశామని తెలిపారు. తమ కులం నుంచి ఎన్ని విమర్శలు ఎదురైనా కూడా వాటిని పట్టించుకోకుండా పార్టీ కోసం కష్టపడ్డామని అన్నారు. ఇంతగా పని చేసిన తమకే ఎమ్మెల్సీ టిక్కెట్టు ఇవ్వకుండా జగన్ మోసం చేశారని ఆరోపించారు. ఈ సంస్మరణ సభను మర్రి రాజశేఖర్ ఇంటి సమీపంలోనే ఏర్పాటు చేశారు. వెంకట సుబ్బయ్య ఈ సభలో ఇలా ఆవేశంగా మాట్లాడినప్పుడు కూడా ఆయన అక్కడే ఉన్నారు. దివంగత నేత రోషయ్యకు ఎదురైన సంఘటలను కూడా ఇందులో వెంకట సుబ్బయ్య ప్రస్తావించారు. ఒక కుల వర్గం రోషయ్యను సీఎంగా ప్రశాంతంగా పని చేయనివ్వలేదని ఆరోపించారు. ఆయన సీఎం పదవి నుంచి దించేంత వరకు తీరిక లేకుండా కష్టపడ్డారని ధ్వజమెత్తారు. సొంత తెలివితేటలతో, ప్రతిభతో ఎన్నో పదవులు అలంకరించిన రోషయ్య చనిపోతే ఆయనకు నివాళి ఇచ్చేందుకు కూడా సీఎం జగన్‌కు సమయం లేదని ఆరోపించారు.
రోషయ్య సంస్మరణ సభలో వెంకట సుబ్బయ్య చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొంత కాలంగా వైసీపీకి సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన నాయకులే పలు సందర్భాల్లో వైసీపీపై కామెంట్స్ చేస్తున్నారు.