విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారోత్సవానికి బయలు దేరారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు వైయస్ జగన్ తాడేపల్లిలోని తన ఇంటి దగ్గర నుంచి 11.53 గంటలకు విజయవాడలోని మున్సిపల్ ఇందిరాగాంధీ స్టేడియంకు బయలుదేరారు. 

వైయస్ జగన్ తోపాటు ఆయన వెంట తల్లి వైయస్ విజయమ్మ, భార్య భారతీరెడ్డి, కుమార్తెలు వర్షారెడ్డి, హర్షారెడ్డి, వైయస్ షర్మిల,షర్మిల కుమారుడు రాజారెడ్డితోపాటు కుమార్తె కూడా బయలు దేరారు. 

జెడ్ ప్లస్ కేటగిరీతో కట్టుదిట్టమైన భద్రత నడుమ వైయస్ జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలు దేరారు. అంతకుముందు వైయస్ జగన్ కు టీటీడీ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. 

అనంతరం వైయస్ జగన్ విశాఖపట్నంలోని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతికి ఫోన్ చేసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం 11.53 గంటల శుభముహూర్తాన వైయస్ జగన్ ప్రమాణ స్వీకార వేదిక వద్దకు బయలుదేరారు.