ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజలను మోసం చేసిన చంద్రబాబుపై టాడా కేసు ఎందుకు నమోదు చేయకూడదని ప్రశ్నించారు.

చంద్రబాబునాయుడుపై టాడా కేసు ఎందుకు నమోదు చేయకూడదని ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేసారు. ప్రత్యేకహోదా సాధనలో భాగంగా విజయనగరంలో విద్యార్ధులతో జగన్ ముఖాముఖి కార్యక్రమం జరిగింది.

అదే సమయంలో జరిగిన ‘యువభేరి’లో జగన్ మాట్లాడుతూ ప్రత్యేకహోదా గురించి అడిగితే చంద్రబాబు పిడి చట్టాన్ని పెడుతున్నట్లు ధ్వజమెత్తారు. అటువంటిది ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజలను మోసం చేసిన చంద్రబాబుపై టాడా కేసు ఎందుకు నమోదు చేయకూడదని ప్రశ్నించారు.

మామూలుగా ‘టాడా’ అన్నది టెర్రరిస్టు కార్యకలాపాలకు పాల్పడే వారిపై నమోదు చేసే కేసు. చాలా తీవ్రమైన కేసు అది. అటువంటిది ఇచ్చిన హామీలపై ప్రజలను మోసం చేసిన వారిపై టాడా కేసు నమోదు చేయాలని జగన్ డిమాండ్ చేయటమన్నది చిన్న విషయం కాదు.

జగన్ చెప్పినట్లు హామీలు అమలు చేయని వారిపై టాడా కేసులు నమోదు చేయటం మొదలైతే, టెర్రరిస్టులకన్నా రాజకీయ నేతలపైనే ఎక్కువ కేసులు పెట్టాల్సి వస్తుందేమో.

అదే సందర్భంలో యువభేరి కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్ధులను ఆకట్టుకునేందుకు జగన్ పలు వీడియోలను ప్రదర్శించారు. ప్రత్యేకహోదాపై రాష్ట్ర విభజన సమయంలోను, ఎన్నికల సమయంలోను వెంకయ్యనాయడు, చంద్రబాబునాయడులు మాట్లాడిన విషయాల క్లిప్పింగులను చూపించారు.

ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకయ్య, చంద్రబాబులు మాట్లాడిన, మాట్లాడుతున్న మాటలను కూడా వీడియో క్లిప్పుంగులను చూపించారు.

దాంతో కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్ధులు అటు వెంకయ్యను, ఇటు చంద్రబాబును గట్టిగా విమర్శిస్తూ మాట్లాడారు. అనంతరం, విద్యార్ధుల ప్రశ్నలకు జగన్ కొన్ని సమాధానాలు చెప్పారు. అదే సమయంలో మరికొందరు విద్యార్ధులడిగిన ప్రశ్నలకు ఇతర విద్యార్ధులచేత సమాధానాలు చెప్పించటం గమనార్హం.