వచ్చే ఎన్నికల్లో గట్టి అభ్యర్ధుల కోసం వైసిపి ఇప్పటి నుండే దృష్టి పెట్టింది. సిట్టింగ్ ఎంఎల్ఏలు, ఎంపిల్లో చాలామందికి మళ్ళీ పోటీ చేసే అవకాశం వస్తుందని అనుకుంటున్నారు. పోయిన ఎన్నికల్లో వైసిపి 67 నియోజకవర్గాల్లో గెలిచింది. అదే విధంగా 8 పార్లమెంటు స్ధానాలను కూడా గెలుచుకుంది. అయితే, రాజకీయ పరిణామాల్లో 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలు వైసిపి నుండి టిడిపిలోకి ఫిరాయించారు. దాంతో ఆ నియోజకవర్గాల్లో వైసిపికి గట్టి దెబ్బ తగిలిందనే చెప్పుకోవాలి. అలాగే, పార్టీ ఓడిపోయిన 108 అసెంబ్లీ, 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో పలు చోట్ల వైసిపికి గట్టి నేతలు లేరు.

పోయిన సారి పార్టీ నాయకత్వం చేసిన తప్పుల వల్ల చాలా నియోజకవర్గాల్లో కొద్దిపాటి తేడాతో టిడిపి అభ్యర్ధులు గెలిచారు. సరిగ్గా ఎన్నికలకు ముందు సామాజికవర్గాలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు నియోజకవర్గాల్లో అభ్యర్ధులను జగన్ మార్చేసారు. అంతేకాకుండా మరికొన్ని నియోజకవర్గాల్లో చివరి నిముషంలో అభ్యర్ధులను ప్రకటించారు. దాంతో ఎన్నికల సమయంలో వైసిపిలో ఒకరకంగా గందరగోళమే రేగింది. దాని ప్రభావం ఫలితాల్లో స్పష్టంగా కనబడింది.

ఆ అనుభవంతోనే జగన్ ముందుగానే నియోజకవర్గాల్లో వివిధ అంశాలపై సర్వేలు చేయించుకుని అభ్యర్ధిత్వాలపై అంచనాకు వస్తున్నారు. అందులో భాగంగానే ముందు ఫిరాయింపు నియోజకవర్గాలపై దృష్టి పెట్టారని సమాచారం. రంపచోడవరం, పాడేరు, అరకులోయ, ప్రత్తిపాడు, అద్దంకి, పలమనేరు, కోడుమూరు, జమ్మలమడుగు, నంద్యాల, ఆళ్ళగడ్డ, గిద్దలూరు లాంటి నియోజకవర్గాల్లో గట్టి ప్రత్యామ్నాయాల కోసం సర్వే జరుగుతోంది. అలాగే, కొవ్వూరు, ఆచంట, గుంటూరు-2, కందుకూరు, అనంతపురం టౌన్, కర్నూలు నుండి బరిలోకి దింపటానికి గట్టి అభ్యర్ధులను రెడీ చేసుకుంటున్నారు. ఇద్దరు, ముగ్గురు పేర్లపై నియోజకవర్గంలో అభిప్రాయసేకరణ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.

ఇవికాకుండా విజయనగరంలో కోలగట్ల వీరభద్రస్వామి, ఏలూరులో ఆళ్ళనాని, రామచంద్రాపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని ప్రకటించేసారు.  కాబట్టి ఆ నియోజకవర్గాల్లో కూడా ప్రత్యామ్నాయాలపై అభిప్రాయ సేకరణ జరుగుతోంది. ఏదేమైనా ఎన్నికలకు ముందే బరిలోకి దింపాల్సిన అభ్యర్ధులపై సర్వేలు చేయించుకోవటం మామూలైపోయింది. వైసిపి తరపున రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గ్రామీణ స్ధాయిలో సర్వేలు చేస్తుండగా, చంద్రబాబునాయుడు వివిధ ఏజెన్సీల ద్వారా సర్వేలు చేయిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.