నిజానికి ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్ అంశాలు చంద్రబాబు పరిధిలో లేవన్న విషయం అందరికీ తెలిసిందే. మోడి ఇస్తానంటే చంద్రబాబేమన్నా వద్దంటారా? పై రెండు హామీలు నెరవేర్చటం మోడికే ఇష్టం లేదు కాబట్టే చంద్రబాబు మోడిపై ఒత్తిడి పెట్టలేకున్నారు. చంద్రబాబు వల్లే సాధ్యం కానిది జగన్ వల్ల ఏమౌతుంది? జగన్ డిమాండ్లలో చిత్తశుద్ది ఉంటే నిలదీయాల్సింది చంద్రబాబును కాదు మోడిని .
మొత్తానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాగా ఇరుక్కుపోయారు. ఎప్పుడైతే జగన్ భారతీయ జనతా పార్టీకి దగ్గరవ్వాలని నిర్ణయించారో అప్పుడే ఆయన పోరాటాలకు పదును పోయినట్లే. శనివారం ఉదయం జరిగిన పార్టీ పార్లమెంట సభ్యుల సమావేశంలో ప్రత్యేకహోదా, ప్రత్యేకరైల్వేజోన్ అంశాలపై కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. నిర్ణయమైతే తీసుకున్నారు గానీ కేంద్రంపై ఒత్తిడి తేగలరా?
ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్ అన్న డిమాండ్లు ఏదో రాష్ట్ర ప్రజల ముందు మాట్లాడేందుకు పనికి వస్తుందో కానీ నిజంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేంత సీన్ జగన్ కు లేదన్న విషయం అందరికీ తెలుసు. మంత్రులు, టిడిపి నేతలంటున్నారని కాదుగానీ నిజంగానే జగన్ కేంద్రంపై ఒత్తిడి తేగలిగే స్ధితిలో అయితే లేరన్నది వాస్తవం. ఎప్పుడైతే జగన్ కేంద్రప్రభుత్వానికి మద్దతు పలికారో అప్పుడే ఏ విషయంలోనైనా కానీండి డిమాండ్ చేసే శక్తి కోల్పోయారు. శక్తి కోల్పోవటమే జగన్ పై ఉన్న కేసులే ప్రధాన కారణం.
చంద్రబాబునాయుడు పరిస్ధితి ఏంటి? కేంద్రంపై ఏరకమైన ఒత్తిడీ తేలేకేకదా ఏం చేయలేక కూర్చున్నది? ఎప్పుడైతే నరేంద్రమోడికి కేంద్రంలో పూర్తిస్ధాయి మెజారిటీ వచ్చిందో అప్పుడే ఎన్డీఏలోని మిత్ర పార్టీలు ప్రధానిని డిమాండ్ చేసే శక్తిని కోల్పాయాయి. దానికి అదనంగా ‘ఓటుకునోటు’ కేసు చంద్రబాబుపై అదనం. కేసులో గనుక విచారణ మొదలైతే చంద్రబాబు పరిస్ధితేంటో ప్రత్యేకించి ఎవరూ చెప్పనక్కర్లేదు. కాబట్టే కేంద్రం పట్టించుకోకపోయినా, ఆఖరుకి ప్రధాని అపాయిట్మెంట్ దొరక్కపోయినా మాట్లాడకుండా రోజులు నెట్టుకొస్తున్నది.
జగన్ పరిస్ధితి కూడా సేమ్ టు సేమ్. నిజానికి ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్ అంశాలు చంద్రబాబు పరిధిలో లేవన్న విషయం అందరికీ తెలిసిందే. మోడి ఇస్తానంటే చంద్రబాబేమన్నా వద్దంటారా? పై రెండు హామీలు నెరవేర్చటం మోడికే ఇష్టం లేదు కాబట్టే చంద్రబాబు మోడిపై ఒత్తిడి పెట్టలేకున్నారు. చంద్రబాబు వల్లే సాధ్యం కానిది జగన్ వల్ల ఏమౌతుంది. డిమాండ్లలో చిత్తశుద్ది ఉంటే జగన్ నిలదీయాల్సింది చంద్రబాబు మీదకాదు మోడి మీద. కానీ మూడేళ్ళలో జగన్ ఎప్పుడూ మోడిని పల్లెత్తుమాట అనలేదన్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే, ఎవరి ఇబ్బందులు వారికున్నాయ్.
