గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే మహ్మద్‌ ముస్తాఫా షేక్‌ కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి.

గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే మహ్మద్‌ ముస్తాఫా షేక్‌ కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ముస్తాఫా సోదరుడు కనుమ ఇంటితో పాటు, ఆయన బంధువుల్లో కొందరి ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కనుమ అంజుమన్ కమిటి అధ్యక్షుడుగా ఉన్నారు. అయితే ముస్తాఫా వ్యాపార లావాదేవీలు మొత్తం కనుమ చూసుకుంటారని తెలుస్తోంది. అయితే ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో ఐటీ అధికారుల సోదాలు మొదలైనట్టుగా తెలుస్తోంది. కేంద్ర బలగాల రక్షణలో ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. అయితే ఏ అంశంలో ఐటీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. 

ఐటీ సోదాల సమయంలో ముస్తాఫా గుంటూరులో లేరని.. ముఖ్యమంత్రి సీఎం జగన్ తెనాలి పర్యటన నేపథ్యంలో అక్కడికి వెళ్లినట్టుగా తెలిసింది. అయితే ఐటీ సోదాల విషయం తెలిసిన వెంటనే ఆయన గుంటూరుకు చేరుకున్నారని తెలుస్తోంది. ఇక, అధికార వైసీపీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ సోదాలు జరగడం ప్రస్తుతం గుంటూరు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

ఇక, ముస్తాఫా ప్రస్తుతం గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ స్థానం నుంచి ఆయన 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు కొన్ని నెలల క్రితం ముస్తాఫా తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు తూర్పు నుంచి తన కూతురు నూరి ఫాతిమా పోటీ చేస్తారని చెప్పారు. తన నిర్ణయం వెనుక ఆర్థిక సమస్యలే కారణమని.. తగినంత డబ్బు లేని రాజకీయాలు ఆర్థిక సంక్షోభానికి దారితీస్తాయని అన్నారు.

తాను వ్యాపార కార్యకలాపాలపై దృష్టి సారించాలని నిర్ణయించుకున్నాని ముస్తాఫా అన్నారు. ఒక వైపు తన కుమార్తె రాజకీయ జీవితానికి, తన నియోజకవర్గంలో ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి నిధులు సమకూర్చే విధంగా వ్యాపార కార్యకలాపాలను చేపడతానని ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ముస్తాఫా రెండోసారి ఎమ్మెల్యే అయినప్పటీ నుంచే ఆయన కూతురు నూరి ఫాతిమా యాక్టివ్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె నియోజవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు.