అమరావతి: తెలుగు రాష్ట్రాలలో బడా ప్రాజెక్టును నిర్మిస్తున్న మెఘా కంపెనీకి షాక్ ఇచ్చారు ఐటీ అధికారులు. దేశవ్యాప్తంగా 35 చోట్ల మెఘా సంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తోంది ఐటీ శాఖ. 

గురువారం అర్థరాత్రి నుంచి ఏకకాలంలో 35 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా మెగా సంస్థ వార్తల్లో హల్ చల్ చేస్తోంది. అంతేకాదు ఈ సంస్థ భారీగా ఆస్తులు కూడ బెట్టిందని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ప్రభావితం చేస్తోందంటూ కూడా పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేశాయి. 

ఇకపోతే పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండిరింగ్ లో భాగంగా ఈ మెఘా సంస్థ మరోసారి వార్తల్లో నిలిచింది. పోలవరం ప్రాజెక్టును దాదాపుగా కైవసం చేసుకున్న మెఘా కృష్ణారెడ్డి రాజకీయంగా చాలా హాట్ టాపిక్ గా మారారు. 

ఇదే తరుణంలో సినీనటుడు శివాజీ సైతం మెఘా కృష్ణారెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. మెఘాకృష్ణారెడ్డి దేశద్రోహి అంటూ విమర్శించారు. తెలుగురాష్ట్రాలే కాదు యావత్ దేశం యెుక్క సొమ్మును దోచేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

కేంద్ర ప్రభుత్వానికి అక్కడ నుంచి రాష్ట్రప్రభుత్వాలకు అత్యంత సన్నిహితుడిగా మారి అనతి కాలంలోనే కోట్లకు పడగలెత్తారని ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారతీయ సంపన్నుల్లోనే మొదటి 100స్థానాల్లో నిలిచిన మెఘా సంస్థ కార్యాలయాలపై ఐటీ దృష్టిపెట్టింది. 

మెఘా సంస్థపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలోనే ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మెఘా సంస్థ ఇప్పటి వరకు చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు, సంపాదించిన ఆస్తుల వివరాలపై ఆరా తీస్తోంది. 

మెఘా సంస్థ అధినేత మెఘా కృష్ణారెడ్డి నివాసంతోపాటు 35చోట్ల మెఘా సంస్థ కార్యాలయాలు ఆయన బంధువులు, అనుచరుల ఇళ్లల్లో సోదాలు కొనసాగుతున్నాయి. సెంట్రల్ టీంకు చెందిన ఐటీ శాఖ అధికారులు ఈసోదాల్లో పాల్గొన్ననట్లు సమాచారం. 

దాంతోపాటు బినామీ కంపెనీల వివరాలు, పన్ను ఎగవేత అంశాలకు సంబంధించి కీలక ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. భారీగా ఫేక్‌ బిల్లులతో పాటు ప్రభుత్వ అధికారుల వద్ద ఉండాల్సిన ఆయా ప్రాజెక్టుల కీలక అంశాలు ఈ సోదాల్లో లభ్యమయినట్లు సమాచారం. 

ఇకపోతే మెఘా సంస్థ తెలంగాణలో 80వేల కోట్లకు పైగా బడ్జేట్‌తో నిర్మిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు, ఆంద్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్ట్‌ ను నిర్మిస్తోంది. ఇటీవలే పోలవరం ప్రాజెక్టును రీ టెండరింగ్ లో దక్కించుకుంది. 

అలాగే తెలంగాణలో మరో కీలక ప్రాజెక్ట్‌ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో కూడా అంచనాల పెంపు మెఘా కంపెనీ కోసమే అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇటీవలే ఆర్టీసీలో ఎలక్ట్రిక్‌ బస్సుల నిర్వహణ, కొనుగోలులో మెఘా కృష్ణారెడ్డి, మెఘా సంస్థపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐటీ దాడులు జరుగుతుండటంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

ఐటీ అధికారులు దాడులు చేయలేదు: ఖండించిన మెఘా కృష్ణారెడ్డి

మెఘా ఇంజనీరింగ్ సంస్థకు సంబంధించి కార్యాలయాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది మెఘా సంస్థ. తమ సంస్థలో ఐటీ అధికారులు మామూలుగానే తనఖీలు నిర్వహించినట్లు తెలిపారు. 

ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఇలాంటి సోదాలు జరుగుతాయని తెలిపింది. అందులో భాగంగానే సోదాలు జరిపినట్లు తెలిపింది. గత 20ఏళ్లుగా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. ఇకపోతే కేవలం హైదరాబాద్ లోని హెడ్ ఆఫీస్ లో మాత్రమే తనిఖీ చేసి వివరాలు అడిగారని చెప్పుకొచ్చారు. 

దేశవ్యాప్తంగా తమకు 17 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయని వాటిలో ఎక్కడా ఇలాంటి తనిఖీలు జరగలేదని మెఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రకటించింది.