Asianet News TeluguAsianet News Telugu

ఎక్కడ ఐటీ దాడులు జరిగినా.. పట్టుబడే సొమ్ము ఏపీ మంత్రులదే కావడం సిగ్గు చేటు: మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు

ఆంధ్రప్రదేశ్ మంత్రులు అక్రమ సంపాదను ఎగబడ్డారని, ఎక్కడ ఐటీ దాడులు జరిగిన.. అందులో పట్టుబడ్డ సొమ్ము ఏపీ మంత్రులవే కావడం సిగ్గు చేటు అని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఐటీ దాడుల్లో ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని పట్టుబడ్డట్టు చెబుతున్నారని, ఆయన సొమ్ము కూడబెట్టుకోవడంలో మునిగిపోయారని వివరించారు. కొడాలి నాని.. బూతుల మంత్రి పేరును సార్థకం చేసుకున్నారని అన్నారు.

IT raids led to andhra pradesh ministers says gollapally suryarao
Author
Amaravathi, First Published Dec 30, 2021, 7:10 PM IST

అమరావతి: మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు(Former Minister Gollapally Suryarao) రాష్ట్ర మంత్రులపై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రజలు ఆర్థిక సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతుంటే.. మంత్రుల మాత్రం అక్రమంగా సొమ్మును పోగేసుకోవడంపై దృష్టి పెట్టారని ఆరోపణలు చేశారు. దేశంలో ఎక్కడ ఐటీ దాడులు(IT Raids) జరిగినా.. పట్టుబడుతున్న డబ్బు మూలాలు మాత్రం ఆంధ్రప్రదేశ్ మంత్రులవేనని అన్నారు. ఆ అక్రమాల్లో ఏపీ మంత్రుల భాగస్వామ్యం ఉన్నదని తేటతెల్లం అవుతున్నదని ఆరోపించారు. హైదరాబాద్‌లో జరిగిన ఐటీ దాడుల్లో పట్టుబడ్డ వంద కోట్లు ఏపీ పౌర సరఫరా శాఖ మంత్రి కొడాలి నానీ(Kodali Nani)కు చెందినదని అందరూ చెబుతున్నారని పేర్కొన్నారు. పౌరులు ఆందోళనల్లో కూరుకుపోయి ఉంటే.. పౌర సరఫరా శాఖ మంత్రి మాత్రం ఆనందంగా డబ్బు పోగేసుకుంటున్నారని ఆరోపించారు.

ప్రజలు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతుంటే.. మంత్రుల బతుకులు మూడు పూవులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నదని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. బినామీ పేర్లతో రాష్ట్ర మంత్రులు వందల కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు. ఎక్కడ చూసినా ఏపీ మంత్రుల అక్రమ సంపాదన బాగోతాలే వినిపిస్తున్నాయని అన్నారు. ఇటీవలే ఓ మంత్రి చెన్నైలో పట్టుబడితే.. ఇప్పుడు కొడాలి నాని హైదరాబాద్‌లో పట్టుబడ్డారని వివరించారు. వీరంతా ఏపీలోని వనరులను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇసుక మాఫియా, మద్యం మాఫియా ద్వారా అక్రమ సంపాదనకు ఒడిగడుతున్నారని వివరించారు. రాష్ట్రంలోని డబ్బు ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు తరలి పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల బతుకులు వెలవెల బోతున్నాయని అన్నారు. వారికి చేద్దామంటే పనులు దొరకడం లేదని, వ్యాపారాలూ లేవని, వ్యవసాయం కూడా కుంటుపడిందని చెప్పారు. ప్రజల జీవితాలే స్తంబించిపోయాయని అన్నారు.

Also Read: రాంకీ సంస్థలో ఐటీ దాడులు... రుజువయ్యిందిదే..: ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (వీడియో)

రైతులు పండించిన పంటకు చెల్లించాల్సిన డబ్బులనూ ప్రభుత్వం చెల్లించడం లేదని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. వారు ఎవరికీ చెప్పుకోవాలో అర్థం కావడం లేదని, రైతుల బకాయిలు ఇప్పటి వరకు చెల్లించనే లేదని మండిపడ్డారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఇలాంటి విషయాలేమీ మాట్లాడరని ఎద్దేవా చేశారు. జవాబుదారీగా సమాధానం చెప్పరనీ నిలదీశారు. కొడాలి నానీ బూతుల మంత్రి అనే పేరును సార్థకం చేసుకున్నారని విమర్శించారు. ఎంతసేపూ ఎదుటి వారిని బెదిరించాలనే, భయపెట్టాలనే ధోరణి తప్ప మరేమీ ఆయన చేయరని పేర్కొన్నారు. ఎదుటి వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే ఆయన పనిగా పెట్టుకున్నారని చెప్పారు. షామీర్‌పేట్‌లో ఏడాది క్రితం 110 ఎకరాల్లో ఒక రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన కంపెనీ పెట్టారని, ఏపీ మంత్రి కూడా అందులో పెట్టుబడులు పెట్టినట్లు రుజువైందని వివరించారు. ఏపీ ప్రజలకు జీవనాధారం లేదని, ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారని, వారికి భద్రత కూడా కరువైందని అన్నారు. మంత్రులేమో కళకళలాడుతూ విందులు, వినోదాల్లో మునిగి తేలుతున్నారని విమర్శించారు. ఇక సంపాదించుకోవడానికి అవకాశం లేదని, ఏది చేయాలన్నా ఈ ఒక్కసారే అనే ఆలోచనలో మంత్రులు ఉన్నారని తెలిపారు. ప్రజల్ని ప్రశాంతంగా బతకనివ్వాలని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు జగన్ ప్రభుత్వానికి హితవు పలికారు.

Follow Us:
Download App:
  • android
  • ios