దివంతగ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులపై ఏకకాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు గురువారం దాడులు చేయటం తమిళనాడులో సంచలనంగా మారింది. జయలలిత మరణించే వరకూ నివసించిన పొయెస్ గార్డెన్ ఇంటితో పాటు జయ టివి కార్యాలయం, శశికళ కుటుంబ సభ్యులకు చెందిన ఇళ్ళు, కార్యాలయాలపైన కూడా ఏక కాలంలో దాడులు జరుగుతున్నాయి. మొత్తం మీద తమిళనాడులోని 190 ప్రాంతాల్లో ఐటి శాఖ దాడులు చేసింది. ఒక్కసారిగా ఐటి శాఖ అధికారులు దాడులు చేయటమన్నది తమిళనాడులో కలకలం రేపుతోంది.

ఒక్క ఏఐఏడిఎంకెలోనే కాకుండా తమిళనాడులోని ఏ రాజకీయ నేతలు, పార్టీల కార్యాలయాలపైన కూడా ఐటి శాఖ ఇంత పెద్ద స్ధాయిలో దాడులు చేయటం ఇదే ప్రధమం. దాంతో మిగిలిన పార్టీలు కూడా అప్రమత్తమయ్యాయి. అసలు, జయ ఇంటితో పాటు జయ టివి, ఇతర వ్యాపార కార్యాలయాలపైన కూడా దాడులు ఎందుకు జరుగుతున్నాయో ఎవరికీ అర్ధం కావటం లేదు.

ప్రస్తుతం తమిళనాడులో రోజు రోజుకు మారుతున్న రాజకీయ సమకీరణలను దృష్టిలో పెట్టుకుంటే కేంద్రంలోని ఎన్డీఏ పెద్దల ఆదేశాలతోనే ఐటి శాఖ దాడులకు దిగిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కొంత కాలంగా తమిళనాడు రాజకీయాల్లో పట్టు కోసం భారతీయ జనతా పార్టీ చాలా కాలంగా ప్రయత్నిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, జయ బతికున్నంత కాలం భాజపాను ఎక్కడా బలపడనీయలేదు.  

అయితే, హటాత్తుగా జయ మరణంతో నరేంద్రమోడి, అమిత్ షా తదితరులు రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెడుతున్న సంగతి అందరూ చూస్తున్నదే. అందులోనూ సినీ ప్రముఖుడు కమలహాసన్ కొత్త పార్టీ పెట్టేదిశగా రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇటువంటి నేపధ్యంలో హటాత్తుగా ఈరోజు ఉదయం నుండి రాష్ట్రవ్యాప్తంగా ఐటి దాడులు చేయటం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగుతోంది.