తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ పై అనర్హత వేటు పడకుండా తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయా? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. చింతమనేని అధికార పార్టీ సభ్యుడవటమే అందుకు ప్రధాన కారణం. దాదాపు ఏడేళ్ళక్రితం జరిగిన ఓ దౌర్జన్యం ఘటనలో చింతమనేనికి భీమడోలు కోర్టు ఈమధ్యనే 2 సంవత్సరాల జైలుశిక్ష విధించిన సంగతి అందరికీ తెలిసిందే.

నిజానికి కోర్టు విధించిన శిక్షను గనుక ప్రభుత్వం అమలు చేసుంటే ఈ పాటికి ఎంఎల్ఏపై అనర్హత వేటు పడుండేదే. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో తిరిగి పోటీ చేయటానికి కూడా అనర్హుడవుతారు. దాంతో టిడిపికి చింతమనేని వ్యవహారం పెద్ద తలనొప్పిగా తయారైంది. తమ ఎంఎల్ఏపై అనర్హత వేటు వేస్తే ప్రధాన ప్రతిపక్షం వైసిపి ముందు చులకనైపోతుంది టిడిపి. అలాగని అనర్హత వేటు వేయకుండా తాత్సారం చేస్తే కోర్టు తీర్పును ధిక్కరించినట్లవుతుంది. దాంతో ఏం చేయాలో చంద్రబాబునాయుడుకు అర్ధం కావటం లేదు.

ఎంఎల్ఏ అనర్హత విషయంలో కోర్టు తీర్పు, ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలు, ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. కానీ వాటిని పాటించే అధికారపార్టీలే తక్కువ. ఓ ఎంఎల్ఏకి ఏ కేసులో అయినా సరే కోర్టు రెండేళ్ళు, అంతకన్నా ఎక్కువ జైలుశిక్ష విధిస్తే వెంటనే పదవిని కోల్పోతారని స్పష్టంగా ఉంది.

ఎలాగంటే, కోర్టు తీర్పు శాసనసభ స్పీకర్ లేదా పార్లమెంటు స్పీకర్ కు అందిన వెంటనే  సంబంధిత న్యాయవాది, ప్రభుత్వ న్యాయవాది  ఆ విషయాన్ని ఎన్నికల కమీషన్ కు వెంటనే తెలియజేయాలి. అప్పుడు ఎన్నికల కమీషన్ కోర్టు తీర్పును పరిశీలించి ఆ సభ్యుడిని వెంటనే అనర్హునిగా ప్రకటిస్తుంది. ఎంఎల్ఏకి సంబంధించిన కోర్టు తీర్పు అసెంబ్లీకి చాలా రోజుల క్రిందటే చేరిందని సమాచారం. కాకపోతే అసెంబ్లీ నుండే ఎన్నికల కమీషన్ కు నివేదిక వెళ్ళలేదట. అందుకే  సభ్యునిపై అనర్హత వేటు పడటంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.