క్రమశిక్షణ అంతా చంద్రబాబు మాటల్లో మాత్రమే. ఈమధ్య కాలంలో టిడిపిలో క్రమశిక్షణ కట్టుతప్పిందనే చెప్పాలి. దానికితోడు ఎప్పుడైతే చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహించటం మొదలుపెట్టారో  మిగిలి ఉన్న కాస్త క్రమశిక్షణ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.

తెలుగుదేశం పార్టీలో కూడా కాంగ్రెస్ మార్కు క్రమశిక్షణ బాగా ఎక్కువైపోయింది. తమ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చంద్రబాబు చెప్పని వేదిక లేదు. అయితే, అదంతా గతం అని తేలిపోయింది. క్రమశిక్షణ అంటే ఎన్టీఆర్ రోజుల్లోనే. తర్వాత నుండి క్రమశిక్షణ అంతా చంద్రబాబు మాటల్లో మాత్రమే. ఈమధ్య కాలంలో టిడిపిలో క్రమశిక్షణ కట్టుతప్పిందనే చెప్పాలి. దానికితోడు ఎప్పుడైతే చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహించటం మొదలుపెట్టారో మిగిలి ఉన్న కాస్త క్రమశిక్షణ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.

మంగళవారం ఉదయం ఒంగోలు పార్టీ కార్యక్రమంలో కరణంబలరాం-గొట్టిపాటి రవికుమార్ గొడవే అందుకు సాక్ష్యం. గొడవలు తారాస్ధాయికి చేరుకోవటం ఒక్క అద్దంకి నియోజకవర్గంలో మాత్రమే కాదు. ఫిరాయింపు ఎంఎల్ఏలున్న దాదాపు అన్నీ నియోజకవర్గాల్లోనూ అదే పరిస్ధితి. కర్నూలు జిల్లా నంద్యాలలో భూమా నాగిరెడ్డి బ్రతికున్న రోజుల్లో టిడిపిలోని ఏవర్గంతోనూ పడేది కాదు. రోడ్డున పడి కొట్టుకున్న ఉదాహరణలెన్నో ఉన్నాయి.

కడపలోని జమ్మలమడుగు, బద్వేలు, అనంతపురం జిల్లాలోని కదిరి, ప్రకాశం జిల్లాలో అద్దంకితో పాటు గిద్దలూరు, కందుకూరు..ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో నియోజకవర్గాల్లో గొడవలు జరుగుతున్నాయ్. అయితే, ఇంత వరకూ అద్దంకిలో మాదిరిగా ఫిరాయింపు ఎంఎల్ఏలు, పార్టీలోని సీనియర్లు నేరుగా కొట్టుకోలేదు. ఈ మూడేళ్ళలో అయితే మరీ క్రమశిక్షణ కట్టుతప్పింది. పోలీసు, రెవిన్యూ శాఖల అధికారులపై ఎక్కడబడితే అక్కడే ఎంఎల్ఏ, నేతలు దాడులు చేస్తున్నారు. అయితే, ఎవ్వరిపైనా చర్యలు లేవు.

కానీ అద్దంకిలో ఎంఎల్సీ కరణం బలరాం, ఎంఎల్ఏ గొట్టిపాటి చొక్కా చింపేయటమే కాకుండా కిందపడేసి కొట్టారంటేనే ఇద్దరి మధ్య వైరం ఏ స్ధాయిలో ఏ స్ధాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. గొడవ జరుగుతున్నపుడు అక్కడే ఉన్న మంత్రులు నారాయణ, శిద్ధారాఘవరావు, పరిటాల సునీతలు కూడా నిర్ఘాంతపోయారు. పార్టీలో క్రమశిక్షణ ఈ స్ధాయిలో బయటపడిన తర్వాత ఇంకా టిడిపి క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చంద్రబాబు చెప్పుకుంటే చెల్లుతుందా?