బోడిగుండుకు మోకాలికి ముడేయటం టిడిపి మీడియాకు బాగా తెలుసు. విషయం ఏమిటంటే, ఎన్డీఏలో నుండి తెలుగుదేశంపార్టీ బయటకు వచ్చేయటంతో దేశంలో స్టాక్ మార్కెట్ కుప్ప కూలిపోయిందట. ఎన్డీఏలో నుండి టిడిపి బయటకు వచ్చేయటానికి, స్టాక్ మార్కెట్ కుప్ప కూలిపోవటానికి ఏంటి సంబంధం? ఎన్డీఏలో నుండి టిడిపి వచ్చేయటంతో దేశంలో రాజకీయ స్ధిరత్వంపై ఆందోళనలు మొదలయ్యాయట. దాంతో స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయిందట. ఇది పచ్చ మీడియా చెప్పే కథలు.

ఎన్డీఏలో నుండి టిడిపి బయటకు వచ్చేస్తుందంటూ ఎప్పటి నుండో అందరూ ఊహిస్తున్నదే. ఎప్పుడైతే కేంద్రమంత్రివర్గానికి టిడిపి ఎంపిలు రాజీనామాలు చేశారో అప్పటి నుండే ఊహాగానాలు మొదలయ్యాయి. ఎన్డీఏలో టిడిపి ఎంతో కాలం ఉండదన్న విషయం అందరికీ తెలిసిందే.

పైగా టిడిపి ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసినంత మాత్రాన దేశంలో రాజకీయ స్ధిరత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదన్న విషయం అందరికీ తెలిసిందే. టిడిపి మద్దతు ఉపసంహరించుకోవటంతో దేశంలోని ఇన్వెస్టర్లలో గుబులు బయలుదేరిందట. సెన్సెక్స్ 510 పాయింట్లు పతనమవ్వటం వల్ల రూ. 1.86 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయిందట. పాయింట్లు పతనమై ఉండొచ్చు, లక్షల కోట్ల సంపద ఆవిరై ఉండొచ్చు. అయితే, ఎన్డీఏలో నుండి టిడిపి బయటకు వచ్చేయగానే స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయిందని చెప్పుకోవటం మాత్రం పచ్చమీడియాకే చెల్లింది.