ఇప్పటికే టిడిపి, భాజపాలు మిత్రపక్షాలుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. వాటికి తోడు కొత్తమంత్రివర్గంలో వైసీపీ పిరాయింపు ఎంఎల్ఏలు కూడా చేరారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మంత్రివర్గం సంకీర్ణ ప్రభుత్వాన్ని తలపిస్తోంది. రెండు మూడు పార్టీలు కలిపి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని సంకీర్ణ ప్రభుత్వమనే అంటారు కదా? ఇపుడు రాష్ట్రంలో జరుగుతున్నది అదే కదా? ఇప్పటికే టిడిపి, భాజపాలు మిత్రపక్షాలుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. వాటికి తోడు కొత్తమంత్రివర్గంలో వైసీపీ పిరాయింపు ఎంఎల్ఏలు కూడా చేరారు. దాంతో అందరూ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిందని చెప్పుకుంటున్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనతను కూడా చంద్రబాబుకే కట్టబెడుతున్నారు.
సరే, ఆ విషయాన్ని పక్కనబడెడితే ఫిరాయింపు ఎంఎల్ఏలకే మంత్రివర్గంలో పెద్దపీట వేసారు చంద్రబాబు. పార్టీలోని నేతలు, ఎంఎల్ఏలు మూకుమ్మడిగా వ్యతిరేకించినా చంద్రబాబు ఎవ్వరినీ ఖాతరు చేయకపోవటం గమనార్హం. మొదటి నుండి కూడా తాను అనుకున్నట్లే కథను సాంతం నడిపించారు. దాంతో గత ఏడాదిగా ఫిరాయింపుల కథ బాగా రక్తికట్టింది. అయితే, ఇక్కడ స్పష్టమైన విషయమేమిటంటే పార్టీ నేతలకన్నా ఫిరాయింపు ఎంఎల్ఏలకే చంద్రబాబు బాగా ప్రాధాన్యత ఇస్తున్నారని.
ఫిరాయింపు ఎంఎల్ఏలకు మంత్రిపదవులు ఇవ్వటం కోసం పార్టీలో దశాబ్దాల పాటు పనిచేస్తున్న సీనియర్లను కూడా సిఎం పక్కన బెట్టేయటం గమనార్హం. ఆలపాటి రాజేంద్రప్రసాద్, గౌతు శ్యాం సుందర శివాజి, దూళిపాళ నరేంద్ర, పయ్యావుల కేశవ్, బండారు సత్యనారాయణ తదితరు లాంటి వారెందరికో చంద్రబాబు మొండి చేయి చూపారు. దాంతో వారంతా మండిపడుతున్నారు.
విచిత్రమేమిటంటే, బోండా ఉమ, వి. అనిత, చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్ళు కూడా ఇదే విషయమై సిఎంపై మండిపడుతున్నారు. అంటే ఇంతకాలం ఉమ, అనిత లాంటి వారిని జగన్నుపై దుమ్మెత్తిపోయటానికి చంద్రబాబు బాగా వాడుకున్నారు. కాబట్టి తమకు మంత్రిపదవులు ఇవ్వకపోతారా అని అనుకున్నారు. రాకపోయేసరికి భంగపడ్డారు. దాంతో మండిపోతున్నారు.
మంత్రివర్గంలో నుండి తప్పించినందుకు బొజ్జల కూడా మండిపోతున్నారు. అందుకే రాజీనామా చేసారు. ఈయనతో పాటు బోండా కూడా రాజీనామా చేసారు. పలువురు వీరి దారిలోనే నడవనున్నట్లు సమాచారం. అయితే, ఇదంతా ఏదో హడావుడి చేయటానికి తప్ప ఇంకెందుకూ పనికి రాదు. ఇటువంటి వారిలో జమ్మలమడుగుకు చెందిన రామసుబ్బారెడ్డి వ్యవహారం ఒక్కటే సీరియస్ గా ఉంది.
