‘హైదరాబాద్ నుండి వచ్చిపోవటమే తెలుసు, పెట్టుబడులు రావాలన్న తపన ఉండటంలేదు’..‘కొర్రీలు వేయటం తప్ప సహకరించటం లేదు’..ఇవి తాజాగా చంద్రబాబునాయుడు కొందరు ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు. అసలు చంద్రబాబుకు ఏమైంది అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. తరచూ ఎవరో ఒకరిపై అసంతృప్తి వ్యక్తం చేయటం చంద్రబాబుకు మామూలైపోయింది. సిఎం తాజా వ్యాఖ్యలు చూస్తుంటే ఏం తెలుస్తోంది? పాలనపై చంద్రబాబు పట్టు కోల్పోతున్నట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. లేకపోతే తన ప్రభుత్వంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులే తన మాట వినటం లేదని ఏ ముఖ్యమంత్రైనా చెబితే ఎలా అర్ధం చేసుకోవాలి?

ఇంతకీ విషయం ఏమిటంటే, సచివాలయంలో శనివారం రాష్ట్రస్ధాయి పెట్టుబడుల ప్రతిపాదనల ఆమోదబోర్డు సమావేశం జరిగింది. ఆ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘ఏపి ప్రభుత్వం మొత్తం హైదరాబాద్ నుండి విజయవాడకు తరలిపోయినా కొంతమంది ఐఏఎస్ లు మాత్రం ఇంకా హైదరాబాద్ నుండే వచ్చిపోతున్నారు’ అంటూ అసంతృప్తి వ్యక్తం చేసారు. ఏపి అభివృద్ధిపై వారికి మమకారం లేకపోవటమే కారణమంటూ నిర్ధారణ కూడా చేసేసారు.

ఇప్పటికీ కొందరు ఐఏఎస్ లు హైదరాబాద్ నుండి విజయవాడకు వచ్చి పోతుంటారు అని చెప్పటంలో అర్ధం లేదు. ఎందుకంటే, హైదరాబాద్ ను పదేళ్ళ ఉమ్మడి రాజధానిగా కేంద్రం పేర్కొన్నది కాబట్టే చాలామంది ఐఏఎస్ లు ఏపికి ఆప్షన్ ఇచ్చారు. లేకపోతే సకల సౌకర్యాలున్న హైదరాబాద్ ను వదిలి ఎటువంటి సౌకర్యాలు లేని అమరావతికి ఎవరెళతారు? చంద్రబాబు మాత్రం అర్ధాంతరంగా హైదరాబాద్ ను వదిలి విజయవాడకు ఎందుకు వెళ్ళిపోయారు?

తన అవసరాల కోసం చంద్రబాబు విజయవాడలో కూర్చున్నారని అందరూ అలాగే విజయవాడలో ఉండాలని నిర్భందించటం ఎంత వరకూ సమంజసం? హైదరాబాద్ నుండి విజయవాడకు రాజధానిని మార్చాలన్న చంద్రబాబు ఆలోచనను అఖిల భారత సర్వీసు అధికారులు, ఉద్యోగులు ప్రతీ ఒక్కరూ అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి అందరికీ తెలిసిందే. నిజానికి హైదరాబాద్ ను వదిలి వెళ్ళటం  చంద్రబాబుకూ ఇష్టం లేదు.

హైదరాబాద్ లో ఉన్న ఇంటిని కూలగొట్టి కొత్తది కట్టుకున్నారే గానీ విజయవాడలో ఎందుకు కట్టుకోలేదు ? దీనిబట్టే అర్ధమవుతోంది విజయవాడపై చంద్రబాబుకున్న ప్రేమ. పైగా విజయవాడ వాతావరణం చాలామందికి పడటంలేదు. తప్పదు కాబట్టే దశాబ్దాల అనుబంధాన్ని, ఆస్తులను, కుటుంబాలను వదిలిపెట్టి ఉద్యోగులు ఒంటరిగా విజయవాడలో ఉంటున్నారు. చంద్రబాబు వైఖరి నచ్చకే పలువురు ఐఏఎస్ లు తెలంగాణాకో లేక కేంద్రానికో ప్రయత్నం చేసుకుని వెళ్ళిపోతున్నారన్నది వాస్తవం. వాస్తవాన్ని దాచిపెట్టి చంద్రబాబు ఐఏఎస్ లపై అసంతృప్తి వ్యక్తం చేస్తే ఉపయోగం లేదు.