రెండు ఎంఎల్సీలూ రాయలసీమ నేతలకే కట్టబెడితే మిగిలిన కోస్తా, ఉత్తరాంధ్ర నేతల్లో అసంతృప్తి మొదలవుతుంది. ప్రస్తుత అవసరాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఫరూఖ్ వైపే చంద్రబాబు మొగ్గటం ఖాయం. కాబట్టి రెడ్డికి మొండిచెయ్యి తప్పదని ప్రచారం మొదలైంది. నంద్యాల ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చేలోగా ఏదో ఓ నిర్ణయం తీసేసుకుంటే బాగుంటుందని మద్దతుదారులందరూ రెడ్డిపై ఒత్దిడి పెడుతున్నారట.

రాయలసీమ కోటాలో రామసుబ్బారెడ్డికి ఇస్తానన్న ఎంఎల్సీ పదవి విషయంలో చంద్రబాబునాయుడు పునరాలోచిస్తున్నట్లు సమాచారం. చాలా కాలంగా చంద్రబాబు వైఖరికి మనస్తాపం చెందిన రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. వైసీపీ నుండి బద్దశత్రువు ఎంఎల్ఏ ఆదినారాయణరెడ్డిని చంద్రబాబు టిడిపిలోకి చేర్చుకున్నారు. వద్దన్నా వినకుండా పార్టీలోకి తీసుకోవటమే కాకుండా ఏకంగా మంత్రిని కూడా చేసారు. దాంతో రెడ్డి చంద్రబాబుపై మండిపోతున్నారు. ఒకదశలో వైసీపీలో చేరుతారనే ప్రచారం కూడా జోరుగా సాగింది.

ఆ దశలో చంద్రబాబు రెడ్డిని పిలిపించుకుని మాట్లాడారు. గవర్నర్ కోటాలో వచ్చే రెండు ఎంఎల్సీల్లో ఒకటిస్తానని హామీ ఇచ్చినట్లు ప్రచారం కూడా జరిగింది. దాంతో రెడ్డి కూడా కాస్త మెత్తబడ్డారు. అయితే, తాజా రాజకీయ పరిస్ధితిల్లో రెడ్డికి ఎంఎల్సీ పదవి ఇవ్వటం సాధ్యం కాదని చంద్రబాబు నిర్ణయించారని పార్టీలోనే ప్రచారం మొదలైంది. అందుకు కారణం నంద్యాల ఉపఎన్నికే.

నంద్యాలలో గెలవటాన్ని చంద్రబాబు ప్రిస్టేజ్ గా తీసుకున్నారు. కానీ వాస్తవ పరిస్ధితులు గెలుపుకు అనువుగా లేవు. దాంతో అందుబాటులో ఉన్న అన్నీ అస్త్రాలను వాడుతున్నారు. నంద్యాల ఓటర్లలో బలిజలు, ముస్లిం మైనారిటీలు, వైశ్యుల సంఖ్య ఎక్కువ. ముందుగా ముస్లింలను బుజ్జగించటంలో భాగంగా మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూఖ్ ను చంద్రబాబు దువ్వుతున్నారు. ఉపఎన్నికల్లో పార్టీని గెలిపిస్తే ఎంఎల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు.

వచ్చేవే రెండు ఎంఎల్సీలు. అందులో గతంలోనే రామసుబ్బారెడ్డికి హామీ ఇచ్చేసారు. తాజాగా ఫరూఖ్ కు కూడా అదే హామీ ఇచ్చారు. ఇద్దరూ రాయలసీమ వాసులే కావటం గమనార్హం. రెండు ఎంఎల్సీలూ రాయలసీమ నేతలకే కట్టబెడితే మిగిలిన కోస్తా, ఉత్తరాంధ్ర నేతల్లో అసంతృప్తి మొదలవుతుంది. ప్రస్తుత అవసరాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఫరూఖ్ వైపే చంద్రబాబు మొగ్గటం ఖాయం. కాబట్టి రెడ్డికి మొండిచెయ్యి తప్పదని ప్రచారం మొదలైంది.

ఇదే విషయాన్ని రెడ్డి మద్దతుదారులు కూడా రెండు రోజుల క్రితం సమావేశమై చర్చించారట. తమకెట్టి పరిస్ధితిల్లోనూ ఏ పదవి రాదని, అందుకు జిల్లాలోని కీలక నేతలతో పాటు ఆదినారాయణరెడ్డి కూడా అడ్డుపడుతున్న విషయాన్ని చర్చించుకున్నారట. కాబట్టి నంద్యాల ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చేలోగా ఏదో ఓ నిర్ణయం తీసేసుకుంటే బాగుంటుందని మద్దతుదారులందరూ రెడ్డికి సూచించారట.