మంత్రికే షాకిచ్చిన ఎంపి: తారస్ధాయికి చేరుకుంటున్న కుమ్మలాటలు

మంత్రికే షాకిచ్చిన ఎంపి: తారస్ధాయికి చేరుకుంటున్న కుమ్మలాటలు

సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అనంతపురం జిల్లాలో టిడిపి కుమ్మలాటలు తారస్ధాయికి చేరుకుంటున్నాయ్. చాలా నియోజకవర్గాల్లో ఎంఎల్ఏల మధ్య పడటం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో ఎంఎల్ఏలకు, ఎంపిలకు మధ్య ఏమాత్రం పొసగటం లేదు.

తాజాగా రాయదుర్గంలో మంత్రి కాలువ శ్రీనివాసులకే అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి ఏకంగా టిక్కెట్టుకే ఎసరు పెడుతున్నారు. తాజాగా జరిగిన ఓ ఘటనే అందుకు ఉదాహరణగా నిలుస్తోంది. ఈమధ్య రెడ్డి సంక్షేమం పేరుతో మంత్రి నియోజకవర్గం రాయదుర్గంలో జెసి ఓ సమావేశం ఏర్పాటు చేశారు.

ఆ సమావేశానికి జిల్లాలోని రెడ్డి సామాజికవర్గంలోని ప్రముఖులతో పాటు టిడిపిలోని రెడ్లు, ప్రధానంగా ఎంపి మద్దతుదారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆ సమావేశంలో జెసి మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో రాయదుర్గం నుండి వైసిపి నుండి ఈమధ్యనే టిడిపిలో చేరిన గుర్నాధరెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు.

హటాత్తుగా జెసి చేసిన ప్రకటనతో అందరూ నివ్వెరపోయారు. అదే సందర్భంలో జెసి ప్రకటన జిల్లా పార్టీలో పెద్ద దుమారాన్నే రేపుతోంది. అంతేకాకుండా రెడ్డి సంక్షేమం పేరుతో ఎంపి అల్లుడు, ఎంఎల్సీ దీపక్ రెడ్డి వరుసబెట్టి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏ సమావేశానికీ మంత్రి కాలువ శ్రీనివాసులకు సమాచారం లేకపోవటం విచిత్రంగా ఉంది.

అయితే, వచ్చే ఎన్నికల్లో కాలువ గుంతకల్ నుండి పోటీ చేస్తారని ఓ వైపు ప్రచారం జరుగుతోంది. గంతకల్ నుండి మంత్రి పోటీ చేయటం  సంగతి ఏమో గానీ ఉన్న రాయదుర్గం నియోజకవర్గంలో మాత్రం పోటీ చేసే అవకాశం లేకుండా ఎంపి వర్గం చేస్తోంది.

ఇదే పంచాయితీ జిల్లా ఇన్చార్జి మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు దగ్గరకు చేరినా ఉపయోగం కనబడలేదు. కొసమెరుపేమిటంటే, జిల్లాలో రాయదుర్గం నియోజకవర్గంలో కాలువ పరిస్ధితికి బహిరంగంగానే వైసిపి నేతలు సానుభూతి వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos