‘వేయించుకున్న’ ఓట్లతో గెలిచిన టిడిపి, ‘ఓట్లేసిన’ చోట ఓడిపోయింది.

తన పాలన గురించి చంద్రబాబేమో మహా గొప్పగా చెప్పేసుకుంటున్నారు. ఊరు వాడ టముకేసుకుని మరీ బ్రహ్మాండమని మీడియాలో రాయించుకుంటున్నారు. 2050 వరకూ టిడిపినే అధికారంలో ఉండాలని బలంగా కోరుకుంటున్నారు. మరి సాధ్యమవుతుందా? ఎంఎల్సీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత చంద్రబాబుకు భవిష్యత్తు ఇబ్బందికరమేనని అనిపిస్తోంది. ఎందుకంటే, వందల మంది ఓటర్లున్న ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసారు, ఒత్తిడిపెట్టి ప్రజాబలం మాదే అనిపించుకున్నారు. అదే వేలమంది ఓటర్లున్న ఎన్నికల్లో బోర్లాపడ్డారు.

కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో స్ధానిక సంస్ధల కోట ఎంఎల్సీ ఎన్నికల్లో టిడిపి గెలిచింది. ఎలా గెలిచినా గెలుపు గెలుపే కదా? ప్రజల మద్దతు తమకే ఉందని బాగా విర్రవీగారు. మరి 24 గంటలు తిరక్కుండానే మరో నాలుగు ఎంఎల్సీ ఎన్నికల ఫలితాల్లో పూర్తిగా ఓడిపోయారు. ఎక్కడా గెలవలేదు. ఓడిపోయిన ఎన్నికల్లో ఓట్లేసింది వేలాది మంది విద్యావంతులు, ఉపాధ్యాయులు. అంటే దాదాపు మధ్య తరగతి జనాలే.

అంటే ఈ ఎన్నికల్లో ఏం తెలుస్తోంది? మధ్య తరగతి ఓటర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని. చంద్రబాబు పాలన అద్భుతంగా ఉంటే మరి పోటీ చేసిన అన్నీ చోట్లా ఎందుకు ఓడిపోతుంది? పశ్చిమ రాయలసీమ టీచర్స్ కోటాలో పోటీ చేసిన బచ్చల పుల్లయ్య ఓడిపోయారు. తూర్పు రాయాలసీమ ఉపాధ్యాయ ఎన్నికల్లో కూడా వాసుదేవనాయడు ఓడిపోయారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో కెజె రెడ్డి ఓటమిపాలయ్యారు.

అదే విధంగా తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో కూడా టిడిపి అభ్యర్ధి పట్టాభిరామిరెడ్డి బోర్లాపడ్డారు. ఇక, ఉత్తరాంధ్రలో గెలిచిన మాధవ్ భాజపా అభ్యర్ధి. కాబట్టి క్రెడిట్ టిడిపికి ఖాతాలో పడలేదు. అంటే ‘వేయించుకున్న’ ఓట్లతో గెలిచిన టిడిపి, ‘ఓట్లేసిన’ చోట ఓడిపోయింది. గెలిచినపుడు విర్రవీగారు. మరి ఓడినపుడు ఏం చేస్తారు?