ఆధునీకరించిన తర్వాత ప్రైవేటుపరం చేసే ఆలోచన చేస్తున్నారంటేనే ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వ డబ్బుతో షోకులు చేసారన్న  విషయం అర్ధమవుతోంది.

చంద్రబాబునాయుడు ప్రభుత్వం ‘ప్రైవేటు’ బాటను కొనసాగిస్తోంది. తాజాగా లాభాల్లో ఉన్న రిసార్ట్స్ ను ప్రభుత్వం ప్రైవేటు పరం చేయటానికి రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అందులోనూ లాభాల్లో ఉన్న రిసార్ట్స్ ను ప్రైవేటు పరం చేయటమంటే, ఎవరో ముఖ్యులకు లబ్ది చేకూర్చేందుకే అన్న అనుమానాలు మొదలయ్యాయి. విజయవాడ కేంద్రంగా ఉన్న బరంపార్కు, భవానీ ద్వీపంతో పాటు విశాఖపట్నం జిల్లాలోని అనంతగిరి తదితరాలను ప్రైవేటుకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించిందట.

బరంపార్కు, భవానీ ద్వీపాలు బాగా లాభాలను సంపాదిస్తున్నాయి. ఖర్చులన్నీ పోను రెండు రిసార్టుల పైన ప్రభుత్వానికి సుమారు రూ. 40 లక్షల ఆదాయం వస్తోంది. ఇక అనంతగిరి కూడా లాభాల్లోనే ఉన్నట్లు సమాచారం. అటువంటిది ప్రైవేటుపరం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్ధం కావటం లేదు. పైగా పై రిసార్ట్స్ కు ఇటీవలే కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి ఆధునీకరించారు కూడా. ఆధునీకరించిన తర్వాత ప్రైవేటుపరం చేసే ఆలోచన చేస్తున్నారంటేనే ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వ డబ్బుతో షోకులు చేసారన్న విషయం అర్ధమవుతోంది.

కాంగ్రెస్ హయాంలో ఇదే భవనా ద్వీపాన్ని కిరణ్ కుమార్ రెడ్డి సిఎంగా ఉండగా గంటా శ్రీనివాసరావుకు సొంతం చేసారు. అయితే, అప్పట్లో ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత, టిడిపి కూడా వ్యతిరేకించటంతో ప్రభుత్వం వెనక్కుతగ్గింది. అయితే, తాజాగా అదే గంటా ఇపుడు మంత్రి. పైగా మరో మంత్రి నారాయణకు వియ్యంకుడు కూడా. దాంతో మళ్ళీ చక్రం తిప్పారేమోనని అనుమానాలు మొదలయ్యాయి. ప్రైవేటుపరం చేస్తున్నారంటేనే మళ్ళీ గంటాకే దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. దాంతో తాజాగా ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. చూడాలి ప్రభుత్వం ఏం చేస్తుందో?
.