ముందస్తు ఎన్నకల ఊహాగానాల నేపధ్యంలో పార్టీలోని ఇంతమంది సీనియర్లు మహానాడుకు హాజరుకాలేదంటే అది చిన్న విషయం కాదు. ఎందుకంటే, వారి నియోజకవర్గాల్లో వారికి బలమైన వర్గాలున్నాయి. అటువంటి వారితో చంద్రబాబుకు ఎప్పటికైనా తలనొప్పులు తప్పవు.
తెలుగుదేశం పార్టీలో అసమ్మతి ఇంకా చల్లారలేదనే అనిపిస్తోంది. పైకి అంతా బాగానే ఉన్నట్లు అనిపిస్తున్నా లోపల్లోపల లావాలా ఉడుకుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందుకు నిన్న ముగిసిన మహానాడే ఉదాహరణ.
టిడిపి పెట్టినప్పటి నుండి ఉన్న పలువురు కీలకనేతలు మహానాడుకు గైర్హాజరయ్యారు. వారిపైనే ప్రస్తుతం పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. అంతర్గతంగా ఉన్న అసమ్మతి మంత్రివర్గ విస్తరణతో ఒక్కసారిగా బయటపడింది.
బయటపడిన అసమ్మతితో చంద్రబాబు కూడా ఖంగుతున్నారు. ఆ స్ధాయిలో తనపై నేతల్లో ఆగ్రహం ఉందన్న విషయం నిజానికి చంద్రబాబుకు కూడా తెలీదనే అనుకోవాలి. మంత్రిపదవులు రాలేదని బోండా ఉమ, చింతమనేని ప్రభాకర్, కాగిత వెంకట్రావు, గౌతు శ్యామ్ సుందర్ శివాజీ, బండారు సత్యనారాయణమూర్తి, దూళిపాళ నరేంద్ర చౌదరి, పయ్యావుల కేశవ్, శ్రవణ్ కుమార్, అనిత తదితరులు బాహాటంగానే చంద్రబాబుపై మండిపడ్డారు.
ఇక, ఫిరాయింపు ఎంల్ఏలకు మంత్రిపదవులు ఇవ్వటాన్ని నిరసస్తూ, రామసుబ్బారెడ్డి, బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్లు చంద్రబాబును నేరుగానే విమర్శించారు. టిడిపి పెట్టినప్పటి నుండి ఆస్ధాయిలో అసమ్మతి బయటపడటమన్నది పెద్ద సంచలనమే. అటువంటి సమయంలో చంద్రబాబు బోండా, చింతమనేని, కాగిత లాంటి వాళ్ళతో మాట్లాడారు. అయితే, అప్పటి నుండి వాళ్లంతా పైకి ఏమీ మాట్లాడకపోయినా చంద్రబాబుపై కోపంతో ఉన్నారన్నది వాస్తవమే.
అందుకు తాజాగా జరిగిన మహానాడు అద్దం పడుతోంది. మూడురోజుల పాటు విశాఖపట్నంలో జరిగిన మహనాడుకు పయ్యావుల కేశవ్, రామసుబ్బారెడ్డి, చింతమనేని ప్రభాకర్, బుచ్చయ్యచౌదరి హాజరుకాలేదు. ఇక, ఎంపిలు శివప్రసాద్, రాయపాటి సాంబశివరావు, మురళీ మోహన్ కూడా గైర్హాజరయ్యారు.
మంత్రివర్గంలో నుండి తప్పించినందుకు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తదితరులు కనింపిచలేదు. పార్టీపై ఎంతటి కోపం ఉన్నా అందరూ మహానాడుకైతే హాజరయ్యేవారు. కానీ ఈసారి మహానాడుకు కూడా హాజరుకాలేదంటే చంద్రబాబుపై వారు ఏస్ధాయిలో ఆగ్రహంతో ఉన్నారో అర్ధమైపోతోంది.
ముందస్తు ఎన్నకల ఊహాగానాల నేపధ్యంలో పార్టీలోని ఇంతమంది సీనియర్లు మహానాడుకు హాజరుకాలేదంటే అది చిన్న విషయం కాదు. ఎందుకంటే, వారి నియోజకవర్గాల్లో వారికి బలమైన వర్గాలున్నాయి. అటువంటి వారితో చంద్రబాబుకు ఎప్పటికైనా తలనొప్పులు తప్పవు. వారిని చంద్రబాబు ఏ విధంగా దారితెచ్చుకుంటారో చూడాలి.
