మేమిక టిడిపిలో ఉండదల్చుకోలేదు... మాకు నచ్చిన ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరతాం లేకపోతే శ్రీకాళహస్తిలో స్వతంత్రంగానే పోటీ చేస్తాం ఇక మీరు దయచేయండి’
బొజ్జలను బుజ్జగిద్దామని వచ్చిన మంత్రి గంటా, ఎంపి సియంరమేష్ లకు ఆయన సతీమణి నుంచి చేదు అనుభవం ఎదురైంది. మంత్రిని సర్దుబాటు చేద్దామని సిఎం తరపున వచ్చిన పై ఇద్దరిపై మంత్రి సతీమణి మండిపడినట్లు గాసిప్ వైరల్ గా చక్కర్లు కొడుతోంది. ‘అనారోగ్యం సాకు చూపించి మంత్రి పదవి నుంచి తన భర్తను తప్పిస్తారా’...? ‘ఏ చంద్రబాబు ఆరోగ్యం మాత్రం బాగుందా’...? ‘ఆయనకు ఎటువంటి అనారోగ్యాలు లేవా’...‘తన భర్తకు ఇంత అన్యాయం చేస్తారా’ అని చంద్రబాబు పంపిన దూతలిద్దర్ని కడిగిపరేసారట బొజ్జల సతీమణి.
దీంతో ఖంగు తిన్న సియం రమేష్ ‘మేమంటే ఈమధ్య వచ్చాం గానీ చంద్రబాబు, బొజ్జల ఎప్పటి నుంచో స్నేహితులు కదా అక్కా’ అని అనునయింబోయారట. దీంతో ‘ఏం స్నేహమయ్యా... స్నేహం విలువ తెలిస్తే చంద్రబాబు ఇలా చేసేవాడా’... ‘స్నేహమంటే వైఎస్.రాజసేఖర్ రెడ్డిది’. ‘తన మిత్రుడు జక్కంపూడి రామ్మోహనరావు తీవ్ర అనారోగ్యంతో నడవలేని స్ధితిలో ఉన్న ఆయన్ను చివరిరోజు వరకూ తన క్యాబినేట్లోనే పెట్టుకున్నాడ’ని అంటూ... ‘మీ రాయబారాలు, గీయబారాలు మాకొద్దు’... ‘మేమిక టిడిపిలో ఉండదల్చుకోలేదు... మాకు నచ్చిన ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరతాం లేకపోతే శ్రీకాళహస్తిలో స్వతంత్రంగానే పోటీ చేస్తాం ఇక మీరు దయచేయండి’ అని నిష్కర్షగా చెప్పారట.
దాంతో అక్కడే ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు కలుగజేసుకుని ‘పార్టీలు మారటాలు వంటి పెద్ద పెద్ద మాటలెందుకు లెండి’... ‘సామరస్యంగా వెళదాం’ అన్నారని తెలిసింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన బొజ్జల సతీమణి ‘నువ్వెవడివిరా మాట్లాడటానికి? ఇప్పటి వరకూ నువ్వు ఎన్ని పార్టీలు మారావు’... ‘నీ చరిత్ర ఏంటి? ‘అసలు వచ్చే ఎలక్షన్ల వరకూ నువ్వు టిడిపిలో ఉంటావా? ‘నువ్వా మాకు నీతులు చెప్పేది’ అని లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడంతో గంటాకు నోటిమాట రాలేదట. దాంతో ఏం మాట్లాడాలో ఇద్దరికీ అర్ధం కాక, ఇంకా అక్కడే ఉంటే ఇంకేం వినాల్సి వస్తుందోనంటూ ఇద్దరూ అక్కడ నుంచి నిష్క్రమించారాట.
